తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Jayasudha: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. సినీనటి జయసుధ పార్టీని వీడనున్నారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించని బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా క్రమంగా కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. నిన్న యువ నాయకుడు విక్రమ్ గౌడ్ రాజీనామా మరువకముందే మరొకరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆమెనే ప్రముఖ నటి, సీనియర్ నాయకురాలు జయసుధ. తాజాగా ఆమె పార్టీ వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం.. ప్రజా భవన్ లో ఆందోళన

తన అనుచరులు, కొందరు ముఖ్య నాయకులతో జయసుధ పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని సమాచారం. పార్టీలో చేర్చుకున్నారు కానీ… ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పాదయాత్రలో పాల్గొన్న తనకు కనీస సెక్యూరిటీ ఇవ్వలేదు అంటూ మండిపడ్డారని విశ్వసనీయంగా తెలిసింది. దేశంలో కలకలం రేపిన ‘మణిపూర్ అలర్లు’ను దారి మళ్లించేందుకు క్రిస్టియన్ అయిన తనను పార్టీలో చేర్చుకున్నారు అంటూ జయసుధ తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సినీ నటిగా కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందిన తనకు పార్టీలో కనీస మర్యాద లేదని.. పార్టీ అవమానపరుస్తోందని జయసుధ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నెలాఖరు వరకు పార్టీ విధానం మారకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానని తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. పార్టీ పట్టించుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వాస్తవమో కాదో ఇంకా స్పష్టత రాలేదు. కానీ పార్టీ తీరుపై మాత్రం జయసుధ అసంతృప్తితోనే ఉన్నారు. కొన్నాళ్లుగా పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Also Read ఎంతో చేశాం.. కానీ చెప్పుకోలేక ఓడిపోయాం: కేటీఆర్

దీనికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జయసుధ అటువైపు చూస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆమె రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. వైఎస్సార్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేయగా ఓడిపోయారు. 2016లో కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. కొన్నాళ్లకు జయసుధ బీజేపీలో చేరారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆమె చేరుతారా లేదా అనేది త్వరలోనే స్పష్టం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button