తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ
Trending

మూవీ రివ్యూ: ‘దేవర’

Pakka Telugu Rating : 2.75/5
Cast : జూ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, శృతి మరాఠే తదితరులు
Director : కొరటాల శివ
Music Director : అనిరుధ్ రవిచందర్
Release Date : 27/09/2024

గత కొన్నాళ్లుగా సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్న పేరు ‘దేవర’.. ఎన్నో అంచనాలతో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ విడుదలైంది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు డైరెక్టర్ కొరటాల శివ కూడా ‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ‘దేవర’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఓసారి చూద్దాం.

కథ

‘మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది ‘దేవర’ కథ. ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరా (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్‌ అవుతాడు. కానీ దేవర మాట కాదని భైరాతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా.. దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరా ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అయ్యింది? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌ స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అన్నది తెరపైనే చూడాలి.

కథనం – విశ్లేషణ

కొరటాల శివ తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా కచ్చితంగా ఓ మెసేజ్ ఉంటుంది. ఇందులోనూ మెసేజ్ ఉంది. ప్రతి మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో కొరటాల శివ చెప్పాలనుకున్న మెసేజ్. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఈ సింగిల్ లైన్‌పైనే సినిమా అంతా సాగుతుంది. పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికితోడు సముద్రం నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్‌గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్‌లోనే తీసేకెళ్లిపోయారు దర్శకుడు కొరటాల. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగ. ఫస్టాఫ్‌లో దేవర కథ చెప్పిన శివ.. సెకండాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించారు. ఇక, మూవీలో యాక్షన్ సీన్స్.. ముఖ్యంగా సముద్రంలో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే సెకండాఫ్‌లో ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్లు అయితే బోర్ తెప్పిస్తాయి. ఇక, తారక్, జాన్వీ మధ్య వచ్చే సీన్స్ బాగానే ఉన్నా.. హీరోయిన్‌ను కేవలం పాటలకే పరిమితం చేసినట్లు అనిపిస్తుంది. నెరేషన్ ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే బాగుండేదని అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌ ట్విస్ట్ మాత్రం బాహుబలి లాగా సెకండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. దర్శకుడు సెకండ్ పార్ట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఫస్ట్ పార్ట్ విషయంలో పెద్దగా సంతృప్తి ఉండదు.

నటీనటులు

ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా ఆయన నటవిశ్వరూపం ప్రదర్శిస్తారు. ‘దేవర’ పాత్రలో అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్‌లో అయితే ఇరగదీశారు. వర పాత్రలోనూ ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర పాత్రలో ఎన్టీఆర్ పలికించిన భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. భైరా పాత్రలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా అద్భుతంగా నటించారు. ‘తంగం’ పాత్రలో జాన్వీ కపూర్ అందంగా కనిపించారు. ‘చుట్ట మల్లే..’ పాట ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్‌, అజయ్, మురళీశర్మ, శ్రుతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.

సాంకేతిక వర్గం

నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. సముద్రంలో తెరకెక్కించిన పోరాట ఘట్టాలు విజువల్ వండర్ అనే చెప్పాలి. అనిరుధ్‌ నేపథ్య సంగీతం సినిమాకే హైలెట్. బీజీఎంతో కొన్ని చోట్ల గూస్ బంప్స్ కూడా తెప్పించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు కానీ మూడు గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • ఎన్టీఆర్ యాక్షన్
  • అనిరుధ్ బీజీఎం
  • వీఎఫ్ఎక్స్

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్ సాగదీత
  • సినిమా నిడివి

పంచ్ లైన్: ‘దేవర’.. ఫస్ట్ పార్ట్‌కి తక్కువ.. సెకండ్ పార్ట్‌కి ఎక్కువ!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button