తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’

Pakka Telugu Rating : 2.5/5
Cast : అల్లరి నరేశ్, అమృత అయ్యర్, రావు రమేశ్, అచ్చుత్ కుమార్, రోహిణి, వైవా హర్ష తదితరులు
Director : సుబ్బు
Music Director : విశాల్ చంద్రశేఖర్
Release Date : 20/12/2024

అల్లరి నరేశ్ అనగానో ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆయన పంథా పూర్తిగా మార్చేశారు. కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలను, అది కూడా సీరియస్‌గా సాగే పాత్రల్ని ఎంచుకుంటూ తన నటనలోని వైవిధ్యాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం!

కథ

బచ్చలమల్లి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. టెన్త్ క్లాస్‌లో ఏకంగా జిల్లా ఫస్ట్ కూడా వచ్చాడు. దాంతో తండ్రి అందరికీ చెప్పుకొని మురిసిపోతాడు. కానీ అది జరిగిన కొన్ని రోజులకే చిన్న భార్య కోసం.. పెద్ద భార్యతో పాటు కొడుకు బచ్చల మల్లిని కూడా వదిలేసి వెళ్లిపోతాడు తండ్రి. దాంతో అప్పటి నుంచి పూర్తిగా మూర్ఖుడిగా మారిపోతాడు మల్లి. ఎవరు ఏం చెప్పినా వినడు.. తనను వదిలేసి వెళ్లిన వాళ్లను ఒక్క క్షణంలో ఆయన కూడా వదిలేస్తాడు. మందుకు, సిగరెట్ కు బానిస అవుతాడు.. అమ్మాయిల అలవాటు కూడా ఉంటుంది. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) వచ్చిన తర్వాత మార్పు మొదలవుతుంది. కానీ తన మూర్ఖత్వంతో ప్రేమలో కూడా ఓడిపోతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? బచ్చలమల్లి జీవితం ఎలా ముందుకెళ్లింది? అసలు అతనికి తండ్రితో ఉన్న సమస్యలేమిటి? అన్నది తెరపైనే చూడాలి.

కథనం, విశ్లేషణ

సింపుల్‌గా చెప్పాలంటే వెనకా ముందూ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఓ మూర్ఖుడి కథ ఇది. అయితే, ఈ కథ ద్వారా డైరెక్టర్ సుబ్బు చెప్పాలనుకున్న నీతి ఏంటంటే.. జీవితం అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి మాట వినకుండా మూర్ఖత్వంతోనే ముందుకు వెళతాం అంటే కుదరదు. అందరినీ కలుపుకోవాలి. అర్థం చేసుకోవాలి.. అని చెప్పాలనుకున్నాడు. తీసుకున్న లైన్ అయితే బాగుంది కానీ చెప్పిన విధానం మాత్రం ఎక్కడో మిస్ కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం కేవలం బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్ మీదకే వెళ్లిపోతుంది. టైటిల్ కార్డు మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు కేవలం మల్లి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. దర్శకుడు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే కంటే కూడా క్యారెక్టరైజేషన్ మీదనే ఎక్కువగా దృష్టిపెట్టాడు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ తండ్రి, కొడుకుల మధ్య గొడవ. తండ్రి తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో ఆ కుర్రాడు అంత మూర్ఖుడిగా మారిపోతాడని చూపించాడు డైరెక్టర్. కానీ వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ఏమాత్రం బలంగా లేవు. ఎంతసేపు హీరో మూర్ఖత్వంగా ముందుకెళ్లడం మాత్రమే ప్రతి సీన్లో చూపించాడు. పైగా ఇందులోని చాలా వరకు సన్నివేశాలు సాధారణంగా, చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి తప్ప ప్రత్యేకతేమీ లేదు. పైగా కొన్ని సన్నివేశాల్లో అయితే మరీ ల్యాగ్ కనిపిస్తుంది. నిజానికి మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజషన్‌కి తోడు, గన్నీ సంచుల వ్యాపార నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న, అవమానంతో రగిలిపోయే తమ్ముడు.. ఇలా ఓ మంచి కుటుంబ కథ కూడా ఇందులో ఉంది. కానీ, ఆ అంశాలపై తగినంత కసరత్తు చేయలేదు. హీరో పాత్రపై జాలి కలగదు, ప్రేమ పుట్టదు, కోపం రాదు. దాంతో సినిమా అంతా ఫ్లాట్‌గా సాగిపోతుంది.

నటీనటులు

కామెడీ పాత్రల్లో ఎంత అలవోకగా నటించేవాడో, సీరియస్ పాత్రల్లో సైతం అల్లరి నరేశ్ అద్భుతంగా నటిస్తున్నారు. నాంది, ఉగ్రం వంటి సినిమాల ద్వారా తన నటనకు ఎలా అయితే మంచి మార్క్స్ కొట్టేశాడో ఇందులోనూ అంతే. విలనిజం ఛాయలతో నరేశ్ ‘బచ్చలమల్లి’ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా మొత్తానికి నరేశ్ నటనే హైలెట్. దానికి తోడు డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక, హీరోయిన్ అమృత అయ్యర్‌కు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. రావు రమేశ్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ విలనిజం ఆకట్టుకుంటుంది. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం

డైరెక్టర్ సుబ్బు కేవలం హీరో క్యారెక్టరైజేషన్ పైనే కాకుండా స్క్రీన్ ప్లే పైన కూడా ఫోకస్ చేయాల్సింది. అలాగే ఎడిటింగ్‌పైన కూడా దృష్టి పెట్టాల్సింది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, బీజీఎం పరవాలేదు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను బాగానే నిర్మించారు.

ప్లస్ పాయింట్స్

  • కథ
  • అల్ల నరేశ్ నటన

మైనస్ పాయింట్స్

  • నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే
  • ఎమోషన్స్ మిస్సవ్వడం
  • కొన్ని సీన్స్‌లో ల్యాగ్

పంచ్ లైన్: ‘బచ్చలమల్లి’.. నరేశ్ వన్ మ్యాన్ షో!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button