తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘అమరన్’

Pakka Telugu Rating : 3/5
Cast : శివకార్తికేయన్, సాయిపల్లవి, భువన్‌ అరోడ, రాహుల్‌ బోస్‌, లల్లు, శ్రీకుమార్‌, శ్యామ్‌ మోహన్‌ తదితరులు
Director : రాజ్‌కుమార్‌ పెరియసామి
Music Director : జీవీ ప్రకాశ్ కుమార్
Release Date : 31/10/2024

భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన మూవీ ‘అమరన్’. ముకుంద్‌ వరదరాజన్‌గా శివకార్తికేయన్‌ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్‌ పాత్రను సాయి పల్లవి పోషించారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ

2014లో కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఇది. చిన్నప్పటి నుంచే సైనికుడు కావాలనేది ముకుంద్ వర‌ద‌రాజ‌న్ (శివ కార్తికేయ‌న్‌) క‌ల. మ‌ద్రాస్ క్రిస్టియ‌న్ కళాశాల‌లో చ‌దువుతున్న‌ప్పుడు త‌న జూనియ‌ర్ అయిన కేర‌ళ అమ్మాయి ఇందు రెబెకా వ‌ర్ఘీస్ (సాయిప‌ల్ల‌వి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇంత‌లో భార‌తీయ సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఉద్యోగానికి ఎంపికవుతాడు. ట్రైనింగ్ అనంత‌రం 22 రాజ్‌పుత్ రెజిమెంట్‌లో విధుల్లో చేర‌తాడు. ముకుంద్ ఇంట్లో వీళ్ల ప్రేమ‌ని ఒప్పుకున్నా.. ఇందు ఇంట్లో తిర‌స్కారం ఎదుర‌వుతుంది. అయినా స‌రే ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ఇందు కుటుంబ స‌భ్యుల్ని ఒప్పించి ఒక్క‌ట‌వుతారు. ఆ ఇద్ద‌రి వ్య‌క్తిగ‌త జీవితం ఎలా సాగింది? ముకుంద్ వృత్తిప‌రంగా ఎలాంటి స‌వాళ్ల‌ని ఎదుర్కొన్నాడు? మేజ‌ర్‌గా ప‌దోన్న‌తి పొంది రాజ్‌పుత్ రెజిమెంట్ నుంచి.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేష‌న్‌పై వ‌చ్చాక ఆయ‌న ఎలాంటి ఆప‌రేష‌న్లని నిర్వ‌హించాడనేది తెర‌పై చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ

ముకుంద్‌ వరదరాజన్‌ గురించి తెలియని చాలా విషయాలను డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి వెండితెరపై చూపించారు.
సైనికుడి బ‌యోపిక్ అంటే ఎక్కువ‌గా వాళ్లు నిర్వ‌హించే ఆప‌రేష‌న్లనీ, క‌మ‌ర్షియాలిటీ కోసం మ‌రికొన్ని క‌ల్పిత స‌న్నివేశాల్ని మేళ‌విస్తూ తెర‌కెక్కిస్తుంటారు. ఇందులో అందుకు భిన్నంగా ముకుంద్ వ్య‌క్తిగ‌త జీవితంపై దృష్టిపెట్టారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితుల మ‌ధ్య విధులు నిర్వ‌ర్తిస్తున్న సైనికుల కుటుంబాల్లో సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుంది? సైనికుల త్యాగాలు ఎలా ఉంటాయి?వాళ్ల కోసం కుటుంబాలు ఎలాంటి త్యాగాలు చేస్తుంటాయ‌న్న‌ది ఇందులో కీల‌కం. ముకుంద్‌, ఇందు ప్రేమాయ‌ణం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రితో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు ప్రేక్ష‌కులు. ఆ ఇద్ద‌రి మ‌న‌సులు క‌ల‌వ‌డం, ఆ వెంట‌నే ఉద్యోగం రావ‌డంతో ఒక‌రికొక‌రు దూరంగా ఉండాల్సి రావ‌డం, పెద్ద‌ల్ని ఒప్పించ‌డం కోసం చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యం.. ఇలా స‌న్నివేశాల‌న్నీ హృద్యంగా సాగుతాయి. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి.. ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీ రిలేషన్స్, దేశభక్తి రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. అలాగే దేశ రక్షణ కోసం ఇండియన్‌ ఆర్మీ చేస్తున్న గొప్ప సేవలను గుర్తు చేశారు. నిజంగా జ‌రిగిన ఆప‌రేష‌న్ల‌ని క‌ళ్ల‌కు క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. క‌శ్మీర్‌లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయి? ఉగ్ర‌వాదులు, వాళ్ల సానుభూతిప‌రుల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎలా ఉంటుంది?సైనికులు ఆప‌రేష‌న్ల కోసం ఎలాంటి ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తుంటారో తెర‌పై చూపించిన తీరు ఇదివ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కి భిన్నంగా ఉంది. ఉగ్ర‌వాదుల రిక్రూట్‌మెంట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో వ‌చ్చే ఆప‌రేష‌న్ ఒకెత్తైతే, ప‌తాక స‌న్నివేశాల్లో అల్తాఫ్ వానీని అంతం చేయ‌డం కోసం చేసిన ఖాజీప‌త్రి ఆప‌రేష‌న్‌ మరో ఎత్తు.

నటీనటులు

ఈ సినిమాకు ప్రధాన బలం శివకార్తికేయన్‌, సాయి పల్లవిల నటనే. మేజర్‌ ముకుంద్‌గా శివకార్తికేయన్‌, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి వారి వారి పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్‌ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. స‌ర‌దా పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపించే శివ కార్తికేయ‌న్ ఇందులో పూర్తి భిన్నంగా త‌నలోని ఓ కొత్త న‌టుడిని ఆవిష్క‌రిస్తూ క‌నిపించారు. రెండు కోణాల్లో సాగే ఆయ‌న పాత్ర, అందుకోసం లుక్ ప‌రంగా ఆయ‌న తీసుకున్న జాగ్ర‌త్త‌లు మెప్పిస్తాయి. ప్రేమికుడిగా, సైనికుడిగా ఆయ‌న మంచి న‌ట‌న‌ని క‌న‌బ‌రిచారు.

సాంకేతిక వర్గం

ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ పెరియ‌సామి మంచి స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని మ‌లిచారు. తెలిసిన క‌థ‌, ఘ‌ట్టాలే అయినా.. ప్రేక్ష‌కుల దృష్టిని మ‌ర‌ల్చ‌నీయ‌కుండా క‌థ‌నాన్ని న‌డిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక జీవీ ప్ర‌కాష్ సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్. సాయి కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. కశ్మీర్ అందాలని చక్కగా చూపించారు. వార్ ఘ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌, ఎడిటింగ్‌ అన్నీ మెప్పిస్తాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

ప్లస్ పాయింట్స్

  • శివ కార్తికేయన్, సాయిపల్లవి నటన
  • ఆకట్టుకునే డైలాగ్స్

పంచ్ లైన్: ‘అమరన్’.. ఓ దేశభక్తుడి జీవిత కథ!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button