తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ
Trending

మూవీ రివ్యూ: ‘సంక్రాంతికి వస్తున్నాం!’

Pakka Telugu Rating : 2.5/5
Cast : వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి, వీటీవీ గణేశ్, నరేశ్, సాయికుమార్, ఉపేంద్ర, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
Director : అనిల్ రావిపూడి
Music Director : భీమ్స్ సిసిరోలియో
Release Date : 14/01/2025

ఎంటర్టైన్‌న్మెంట్‌కి కేరాఫ్ అనిల్ రావిపూడి – వెంకీ మామా కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయం. ఈ నేపథ్యంలోనే ‘సక్రాంతికి వస్తున్నాం!’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించడంతో మరింత గ్లామర్ తోడైంది. పైగా ఎవరూ చేయని విధంగా వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. మరి సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ

అమెరికాలోనే టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం (నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. పార్టీ ప్రెసిడెంట్ (వీటివీ గణేష్) స్పెషల్ పార్టీ అని సత్య ఆకెళ్లను ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లడంతో కొంతమంది దుండగులు సత్య ఆకెళ్లని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేని విడుదల చేయమంటారు. సత్య కిడ్నాప్ బయటకు తెలిస్తే తమ రాష్ట్ర పరువు, సీఎం పదవి పోతుందని ఎవరికీ తెలియకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడటానికి మాజీ పోలీసాఫీసర్ YD రాజు (వెంకటేష్) చేతికి ఆ మిషన్ అప్పగించాలనుకుంటారు. దీంతో ఈ ఆపరేషన్‌ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. ఈ ఆపరేషన్‌కి రాజు భార్య భాగ్యం (ఐశ్వర్యా రాజేశ్) ఎలా ఒప్పుకుంది? ఈ ఆపరేషన్‌లో ఓ వైపు భార్య, మరోవైపు ప్రియురాలి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు? ఆపరేషన్‌ ఎలా చేశాడు? మాజీ ప్రియురాలు, భార్య కలిసి రాజుని ఎలా ఇబ్బంది పెట్టారు? దీంతో రాజులో వచ్చిన మార్పేంటి? ఇందులో బుడ్డోడు బుల్‌రెడ్డి ఏం చేశాడు? వంటి అంశాలన్నీ తెరపైన చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ

కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనమేమీ లేదు. రొటీన్ కామెడీ ఎంటర్టైనర్. కాకపోతే తనదైన శైలిలో హస్యాన్ని జోడించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి అదే ట్రీట్‌‌‌‌మెంట్‌తో చెలరేగిపోయాడు. వెంకీ మామ ఇమేజ్.. ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ మీటర్‌లో రాసుకొన్న సన్నివేశాలు హిలేరియస్ హాస్యాన్ని పండించాయి. ఎంటర్‌టైన్‌‌మెంట్‌తోపాటు యాక్షన్ జోడించి సంక్రాంతి పండుగ సంబరాన్ని సినీ అభిమానులకు పంచాడనే చెప్పాలి. నిజానికి ఈ స్టోరీ లైన్‌ను చిత్ర బృందం టీజర్, ట్రైలర్లతోనే చెప్పేసినా.. వాళ్ల ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించింది. దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలోపెట్టుకునే ప్రేక్షకుల్ని విసిగించకుండా.. సత్య ఆకెళ్ల కిడ్నాప్‌ డ్రామాతో కథ మొదలెట్టేసి.. రెస్క్యూ ఆపరేషన్‌ పేరుతో తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయారు. భార్యపై వైడీ రాజు చూపించే ప్రేమ, పిల్లలతో కలిసి చేసే అల్లరి.. ఇంట్లో మామ నుంచి తనకెదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్, హాయ్‌ మెసేజ్‌పై నడిచే రచ్చ.. అన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే, ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ చాలా స్లోగా సాగుతుంది. కథంతా ఊహలకు తగ్గట్లుగానే చాలా రొటీన్‌గా సాగుతుంది. నిజానికి ద్వితీయార్ధంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు. కొన్ని చోట్ల క్రింజ్ కామెడీ విసిగిస్తుంది కూడా. అయితే, క్లైమాక్స్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుటుంది. విలన్లను చావగొడుతూ ఫ్రస్టేషన్‌తో వెంకీ మామా చెప్పే జీవిత సూత్రాలు డుపుబ్బా నవ్విస్తాయి. సినిమా అంతా ఫన్ రైడ్ చూపిస్తూనే చివరలో గురువుని గౌరవించాలి అన్న సందేశాన్ని ఇచ్చిన తీరు మెప్పిస్తుంది.

నటీనటులు

ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు వెంకటేశ్ పెట్టింది పేరు. వాస్తవానికి ఈ మూవీలో వెంకీ మామాది వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఓ వైపు లవర్‌ బాయ్‌గా.. మరోవైపు సిన్సియర్‌ పోలీస్‌గా విభిన్న కోణాల్లో కనిపించారు. తనదైన మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌లో మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ఫుల్ మీల్స్ అందించారు. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ఇద్దరికీ మంచి ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. ఈ ఇద్దరూ వెంకీతో పోటీ పడి నటించారు. వీళ్ల ముగ్గురి కామెడీ టైమింగ్‌ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది. వెంకీ కొడుకుగా చేసిన బుడ్డోడు కూడా దుమ్ములేపాడు. మామగా మురళీధర్‌ గౌడ్‌ రెచ్చిపోయాడు. సీఎంగా నరేష్‌ ఆకట్టుకున్నారు. పార్టీ ప్రెసిడెంట్‌గా వీటీవీ గణేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యింది. ఆకెళ్ల శ్రీనివాస్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఉపేంద్ర పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం

నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు. కెమెరా మెన్ సమీర్ రెడ్డి ప్రతి సీన్‌ను చాలా రిచ్‌గా చూపించారు. గోదావరి అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. ఇక, భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్, బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘గోదారి గట్టు’ సాంగ్‌కి అయితే థియేటర్లలో విజిల్స్ పడతాయి. ఇక దర్శకుడు అనిల్‌ రావిపూడి కామెడీని బాగా డీల్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. బలవంతంగా ఇరికించిన కామెడీ కాకుండా సిచువేషన్ కామెడీకి ప్రయారిటీ ఇచ్చి చేశాడు. కానీ సెకండాఫ్‌ని కూడా అదే స్థాయిలో తీసుకెళ్తే బాగుండేది. సెకండాఫ్‌లో కాస్త ల్యాగ్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ అవుతుంది.

ప్లస్ పాయింట్స్

  • అనిల్ రావిపూడి మార్క్ కామెడీ
  • వెంకటేశ్ నటన
  • వెంకీ మామా, ఐశ్యర్యా రాజేశ్, మీనాక్షి చౌదరిల కామెడీ సీన్లు

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్ ల్యాగ్
  • కొన్ని చోట్ల క్లింజ్ కామెడీ

పంచ్ లైన్: పండక్కి చూడదగ్గ ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్!’

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button