తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ
Trending

మూవీ రివ్యూ: ‘డాకు మహారాజ్’

Pakka Telugu Rating : 2.5/5
Cast : బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధాశ్రీనాథ్, బాబీ డియోల్, రవి కిషన్ తదితరులు
Director : బాబీ
Music Director : తమన్
Release Date : 12/01/2025

మాస్ హీరో బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బాబీ కాంబోలో సినిమా అంటే ఆడియన్స్‌లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో, భారీ అంచనాలతో తెరకెక్కిన మూవీ ‘డాకు మహారాజ్’. ఇందుకు తగ్గట్టే మూవీ టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలన్ని పెంచేసేంది. మరి సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ

చిత్తూరు జిల్లాలో ఈ కథ మొదలవుతుంది. మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) విద్యావేత్త. ఓ పెద్ద స్కూల్ ని నడుపుతుంటాడు. తనకో కాఫీ ఎస్టేట్ వుంటుంది. దాన్ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) అక్కడ వన్యమృగాలని అక్రమంగా తరలిస్తుంటాడు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులని ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు.. కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్ దేశపాండే చంబల్‌లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్ (బాలకృష్ణ)కు కబురుపెడతాడు. మహారాజ్ నానాజీగా పేరు మార్చుకొని పాపకి డ్రైవర్ గా చేరుతాడు. ఇంత‌కీ ఈ మ‌హారాజ్ ఎవ‌రు? భోపాల్‌లో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది? వైష్ణ‌వికీ, ఆయ‌న‌కీ సంబంధం ఏమిటి? ఈ క‌థ‌తో బ‌ల్వంత్ ఠాకూర్ (బాబీ దేవోల్‌), నందిని (శ్ర‌ద్ధా శ్రీనాథ్), కావేరి (ప్ర‌జ్ఞా జైస్వాల్‌)ల‌కు సంబంధం ఏమిట‌నే విష‌యాలు తెరపైనే చూడాలి.

కథనం, విశ్లేషణ

మాస్ యాక్షన్ కథలకు బాలకృష్ణ కేరాఫ్ అన్న విషయం తెలిసిందే. సింహ, లెజెండ్, జై సింహా, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి రీసెంట్ సినిమాల్లో బాలయ్య మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. భగవంత్ కేసరిలో ఆడవాళ్లని గౌరవించాలని బలంగా చెప్పిన బాలయ్య.. ‘డాకు మహారాజ్‌’తో నీటి సమస్యపై గొంతెత్తారు. బాలయ్యకు పర్ఫెక్ట్‌గా సూట‌య్యే ఓ ఫ్యాక్షన్ కథని చంబల్ బ్యాక్ డ్రాప్‌లో రాసుకున్నారు డైరెక్టర్ బాబీ. డాకు మహారాజ్ కథ ఎత్తుగడే భిన్నంగా ఉంటుంది. అడవిలో సెట్ చేసిన ఓ భారీ ఇంటర్వెల్ బ్యాంగ్‌ని తొలి సన్నివేశంలోనే చూపిస్తూ కథని మొదలుపెడతారు. కృష్ణమూర్తి కుటుంబం, పాప, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు.. ఈ పాత్రల చుట్టూ బిగినింగ్‌లో నడిపిన సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. నానాజీగా బాలయ్య ఎంట్రీ తర్వాత కథ పుంజుకుంటుంది. తొలి సగంలో పాప ఎమోషన్‌ని ఎస్టాబ్లెస్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. మరోవైపు స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ (షైన్ టామ్ చాకో) డాకు గురించి చేసే అన్వేషణ ఆ పాత్ర పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఓ ఫైట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే డబిడి దిబిడి సాంగ్ వన్స్ మోర్ అనేలా కుదిరింది. ఈ సినిమాకి మొదటి నుంచి హైలెట్ గా చెప్పుకుంటూ వస్తున్న ఇంటర్వెల్ బ్లాక్ .. నిజంగానే అదిరింది. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. అస‌లు క‌థంతా ద్వితీయార్ధంలోనే. ఇంజినీర్ అయిన సీతారాం.. డాకు మ‌హారాజ్‌గా మార‌డానికి దారితీసే ప‌రిస్థితులు ఆక‌ట్టుకుంటాయి. ఫ్లాష్‌బ్యాక్‌గా వ‌చ్చే ఆ స‌న్నివేశాలు చంబ‌ల్‌కా భ‌గ‌వాన్‌గా బాల‌కృష్ణ‌ని, ఆ ప్రాంత ప్ర‌జ‌ల్ని ముప్పు తిప్ప‌లు పెట్టిన న‌ర‌రూప రాక్ష‌సుడు బ‌ల్వంత్ ఠాకూర్‌గా బాబీ దేవోల్‌ని ఆవిష్క‌రిస్తాయి. అయితే రొటీన్ స్టోరీ లైన్, ఊహాజనితంగా సాగే కథనం బోర్ కొట్టిస్తుంది. ఇక, క్లైమాక్స్ మాత్రం చాలా నిరాశ కలిగిస్తుంది.

నటీనటులు

యాక్షన్ సన్నివేశాల్లో నటించడం బాలయ్యకు కొత్తేం కాదు. ఇంజినీర్ సీతారాంగా, నానాజీగా, డాకు మ‌హారాజ్‌గా బాలకృష్ణ భిన్న కోణాల్లో తెర‌పై క‌నిపించిన తీరు మెప్పిస్తుంది. మూడు కోణాల్లోనూ ఆయన చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక సినిమా మొత్తాన్ని ఒక మలుపు తిప్పే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ అదరగొట్టింది. ప్రగ్యా జైస్వాల్ పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో మెప్పించింది. ఎస్సై పాత్రలో ఊర్వశి నటించడం కంటే గ్లామర్ ఆరబోతకే పరిమితమైంది. యానిమల్ తర్వాత బాబీ డియోల్‌కి అలాంటి ఒక పవర్ ఫుల్ పాత్ర పడింది.ఇక రిషి, రవి కిషన్, సందీప్ రాజ్, చాందిని చౌదరి, సచిన్ ఖేడ్కర్ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం

సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాటల కంటే కూడా యాక్షన్ సన్నివేశాల్లో తమన్ బీజీఎం మెప్పిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్లకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా రాసుకున్న డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. విజ‌య్ క‌న్న‌న్ కెమెరా పనితీరుకు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. అయితే డైరెక్టర్ బాబీ రాసుకున్న రొటీన్ స్టోరీ లైన్, ఊహాజనితంగా సాగే కథనం మాత్రం బోర్ కొట్టిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయిసౌజ‌న్య‌ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకడాలేదు.

ప్లస్ పాయింట్స్

  • బాలకృష్ణ నటన
  • తమన్ బీజీఎం
  • ఫ్లాస్ బ్యాక్ ఫైట్ సీన్స్

మైనస్ పాయింట్స్

  • రొటీన్ స్టోరీ
  • ఊహాజనిత కథనం
  • వీక్ క్లైమాక్స్

పంచ్ లైన్: ‘డాకు మహారాజ్’.. బాలకృష్ణ రొటీన్ మాస్ ఎంటర్టైనర్!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button