Pakka Telugu Rating : 2.5/5
Cast : రామ్ చరణ్, కియరా అడ్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు
Director : శంకర్
Music Director : తమన్
Release Date : 10/01/2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – యూనివర్సల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సోలో మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో, మూడేళ్లు కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత దిల్ రాజు చెప్పడంతో మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది? రామ్ చరణ్ మూడేళ్ల కష్ట ఫలించిందా? భారతీయుడు-2 డిజాస్టర్ తర్వాత శంకర్‌కి ఈ మూవీ కమ్ బ్యాక్ ఇచ్చిందా? రివ్యూలో చూద్దాం.
కథ
రామ్ నందన్ (రామ్ చరణ్) తాను ప్రేమించిన అమ్మాయి కోసం IPS నుంచి IASగా మారి కలెక్టర్‌గా వైజాగ్ జిల్లాకు వస్తాడు. అవినీతి పరులు, రౌడీల ఆట కట్టించే పనిలో పడతాడు. ఈ క్రమంలో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య)కు శత్రువు అవుతాడు. మోపిదేవి తన తండ్రి, సీఎం బొబ్బిలి సత్యమూర్తి(శ్రీకాంత్) చనిపోతే సీఎం అవుదామని ఎదురుచూస్తూ ఉంటాడు. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌ని అధికార బలంతో ఏం చేశాడు? రామ్‌నందన్.. వాటికి ఎలా బదులిచ్చాడు? అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి)తో రామ్‌నందన్‌కి ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే తెరపైనే చూడాలి.
కథనం, విశ్లేషణ
గతంలో శంకర్ సినిమాల్లో గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకుల చుట్టూ కథలు తిరిగేవి. రోబో సినిమా నుంచి తన పద్ధతి మార్చిన శంకర్ మళ్లీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో తన పాత రూట్లోకి వెళ్లాడు. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి తలుచుకుంటే ఏం చేయగలడు అని రాజ్యాంగంలో ఉన్న అన్ని రూల్స్‌తో చరణ్ పాత్రను రాసుకున్నాడు. పైగా చరణ్ పాత్రకు కావాల్సినన్నీ ఎలివేషన్స్ కూడా ఇచ్చారు. కానీ కాలం చెల్లిన.. రొటీన్ స్టోరీ కావడంతో ఏమాత్రం ఇంప్రెసివ్‌గా అనిపించదు. బోరింగ్ నెరేషన్, ఆకట్టుకోని స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్, ఎస్.జె. సూర్యల మధ్య వచ్చే కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక, హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే లవ్‌ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా.. బోర్ కొట్టిస్తుంది. ఇక, కాలేజీ ఎపిసోడ్ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. రొటీన్ కామెడీ, పేలవమైన డైలాగ్స్‌తో ఫస్టాఫ్ సాగదీతలా అనిపిస్తుంది. అయితే విరామ సన్నివేశాల్లో వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని కూడా పెంచుతుంది.
ఇక సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ‘అప్పన్న’ ఎపిసోడ్ మెప్పిస్తుంది. సినిమాలో ఇదొక్కటే హైలెట్ అని చెప్పాలి. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరు సినిమాలో లీనం చేస్తుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మళ్లీ కథంతా రొటీన్‌గా సాగుతుంది. ఇక, క్లైమాక్స్ ఫైట్ అయితే బోర్ తెప్పిస్తుంది. శంకర్ సినిమా అంటేనే పాటలకు, విజువల్స్‌కి ఫేమస్. ఆయన సినిమాల్లో పాటలు చాలా గ్రాండియర్‌గా అనిపిస్తాయి. కానీ ఇందులో శంకర్ మార్క్ కనిపించదు. ఒక్క ‘జరగండి.. జరగండి’ సాంగ్ తప్ప ఇతర పాటలు ఏమంత ఇంప్రెసివ్‌గా లేవు. ఇక, టెక్నికల్ ఇష్యూ కారణంగా ‘నానా హైరానా’ పాట పెట్టకపోవడం మైనస్. ఈ పాటకు యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ వచ్చాయి. కానీ మూవీలో లేకపోవడం ఆడియన్స్‌ను అసంతృప్తికి గురి చేస్తుంది.
నటీనటులు
రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ ఒదిగిపోయారు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ నటన మెప్పిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ చరణ్ అదరగొట్టారు. అంజలి పాత్రతో పోల్చితే కియారా అడ్వానీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పైగా రామ్ చరణ్, కియారా అడ్వానీ మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా వీక్‌గా ఉండటంతో ఆమె పాత్ర తేలిపోయింది. అప్పన్న భార్యగా పార్వతి పాత్రలో అంజలి నటన ఆకట్టుకుంటుంది. ఎస్‍జే సూర్య తన మార్క్ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్‌కు చాలా రోజుల తర్వాత మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. రెండు గెటప్స్‌లో శ్రీకాంత్ చక్కగా నటించారు. సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నవీన్ చంద్ర పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం చిన్న సీన్‌లో కనిపించి నవ్విస్తారు.
సాంకేతిక వర్గం
సినిమా ఖర్చు విషయంలో నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ పని తీరు బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న కథకు ఇంకాస్తా పదును పెట్టాల్సింది. తమన్ సంగీతం పర్వాలేదు. జరగండి.. జరగండి సాంగ్ గ్రాండియర్‌గా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్
- అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన
- కొన్ని సాంగ్స్, విజువల్స్
- ఇంటర్వెల్ మలుపు
మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ, బోరింగ్ నెరేషన్
- వీక్ లవ్ ట్రాక్ & కామెడీ
- సాగదీత సన్నివేశాలు
పంచ్ లైన్: అన్‌ప్రెడిక్టబుల్ కాదు, అంతా ప్రెడిక్టబులే!