తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘జనక అయితే గనక!’

Pakka Telugu Rating : 3/5
Cast : సుహాస్, సంగీర్తన విపిన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను తదితరులు
Director : సందీప్ రెడ్డి బండ్ల‌
Music Director : విజ‌య్ బుల్గానిన్‌
Release Date : 12/10/2024

విభిన్న కథల్ని, భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్నవదనం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టారు. తాజాగా దసరా కానుకగా నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త దర్శకుడితో ‘జనక అయితే గనక’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ

ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి కథ ఇది. ప్రసాద్ (సుహాస్) ఓ మధ్య తరగతి కుర్రాడు. తనకు భార్య (సంగీర్తన విపిన్) అంటే ప్రాణం. కానీ తనకు పిల్లలు కనడం ఇష్టముండదు. పిల్లలకు అన్నీ ‘ది బెస్ట్’ ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్న ప్రసాద్.. తన బొటాబొటి జీతంతో పిల్లలకు అన్నీ సమకూర్చడం కష్టమని పిల్లల్ని కనే ఆలోచననే అటకెక్కించేస్తాడు. అర్థం చేసుకునే భార్యతో ప్రేమగా ఉంటూ జీవితాన్ని నడిపిస్తుంటాడు. అయితే అనూహ్యంగా ఓ రోజు తాను గ‌ర్భం దాల్చిన‌ట్టు ప్రసాద్‌ భార్య చెబుతుంది. ఆమె గ‌ర్భం దాల్చ‌డానికి కార‌ణం తాను వాడుతున్న కండోమ్స్‌లో నాణ్య‌త లేకపోవ‌డ‌మేనని కోర్టుకెక్కుతాడు. కండోమ్స్ కంపెనీ నుంచి రూ.కోటి ప‌రిహారం కోరతాడు. మ‌రి ఈ కేసులో ప్ర‌సాద్ గెలిచాడా? కోటి ప‌రిహారం అందిందా? పిల్లలకు తండ్రి అయ్యాడా? అన్నది చిత్ర కథ.

కథనం – విశ్లేషణ

వివిధ సమస్యలపై హీరోలు కోర్టుల్లో పోరాటం చేయడం, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చివరకు విజయం సాధించడం చాలా సినిమాళ్లో చూశాం. ఇది కూడా ఆ కోవకు చెందిన కథే. కాకాపోతే ఇందులో స్టోరీ మెయిన్ లైన్ చాలా సున్నితమైన అంశం. తెలుగులో ఇలాంటి క‌థా నేప‌థ్యాలే అరుదు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఓ చిరుద్యోగి, ఓ పెద్ద కంపెనీని ఎలా ఢీ కొట్టాడనేది ఇందులో మ‌రో ఆస‌క్తిక‌రం. అలాగ‌ని ఇది కోర్టు రూమ్ డ్రామా మాత్ర‌మే కాదు, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పిల్ల‌ల్ని క‌న‌డానికి అంత‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎందుకొస్తోంద‌నే అంశాన్నీ ఇందులో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ పోరాటం కంపెనీపైనే కాదు, మ‌న వ్య‌వ‌స్థ‌పై అనే సంభాష‌ణ సినిమాలో వినిపిస్తుంది. పిల్ల‌లు అనే ఎమోష‌న్ చాటున ఏం జ‌రుగుతోంది? మ‌న వ్య‌వ‌స్థ ఎలా మారింద‌నే అంశాలు ఆలోచ‌న రేకెత్తిస్తాయి. ప్ర‌సాద్ ఉద్యోగం క‌ష్టాల్ని ఒక‌వైపు, అన్ని క‌ష్టాలున్నా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ సాగించే ప్ర‌యాణాన్ని మ‌రోవైపు చూపిస్తూ క‌థ‌ని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి. అస‌లు క‌థ మాత్రం ప్ర‌సాద్ భార్య గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచే మొద‌ల‌వుతుంది. అప్ప‌టిదాకా ఇంటికి ప‌రిమిత‌మైన క‌థ కాస్త కోర్ట్ రూమ్‌కి వెళుతుంది. ఇక సెకండాఫ్‌లో లాయ‌ర్ రాజీవ్ శ‌ర్మ (ముర‌ళీశ‌ర్మ) కేసు కోసం రంగంలోకి దిగాక కోర్టు రూమ్ డ్రామా మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది. త‌న స్నేహితుడు, న్యాయ‌వాది అయిన ప‌త్తి కిశోర్ (వెన్నెల కిశోర్‌)తో క‌లిసి ప్ర‌సాద్ ఈ కేసుని డీల్ చేసిన విధానం, కుటుంబంలో సంఘ‌ర్ష‌ణ ద్వితీయార్ధానికి హైలైట్‌. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ రియాల్టీకి కాస్త దూరంగా ఉంది. బెస్ట్ ఇవ్వ‌లేమ‌ని పిల్ల‌ల్ని క‌న‌కుండా ఉండేవాళ్లు సమాజంలో చాలా అరుదు. ఆరంభ స‌న్నివేశాలతోపాటు, ద్వితీయార్ధంలో కొంత భాగం సాగ‌దీత‌లా అనిపిస్తుంది. డైలాగ్స్, కామెడీ మాత్రం బాగున్నాయి.

నటీనటులు

పాత్ర ఏదైనా సుహాస్ ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోతారు. ఇందులోనూ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో చక్కగా నటించారు. తండ్రి, స్నేహితుడు, భార్య‌తో క‌లిసి హాస్యాన్ని, భావోద్వేగాల్ని పండించిన తీరు మెప్పిస్తుంది. కోర్టు రూమ్ డ్రామాలోనూ చాలా స‌న్నివేశాలు ఆయ‌న చుట్టూనే తిరుగుతాయి. అందులోనూ ఆయ‌న ప్ర‌తిభ క‌నిపిస్తుంది. ప్ర‌సాద్ భార్య‌గా న‌టించిన సంగీర్త‌న విపిన్ చక్కని అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ఇక రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీనుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ముగ్గురూ సినిమాకు బలం. తమ కామెడీ టైమింగ్స్‌తో కడుపుబ్బా నవ్వించారు.

సాంకేతిక వర్గం

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం వల్ల బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సున్నితమైన కథకు కామెడీని జోడించిన డైరెక్టర్ సందీప్ ప్రతిభ మెచ్చుకోదగినది. అయితే ఎడిటింగ్‌కి కొంచెం పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • సుహాస్ నటన
  • కామెడీ
  • రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను

మైనస్ పాయింట్స్

  • కొన్ని సాగదీత సన్నివేశాలు

పంచ్ లైన్: జనక అయితే గనక!.. నవ్విస్తుంది కాదనక..!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button