తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘కంగువా’

Pakka Telugu Rating : 2.75/5
Cast : సూర్య, బాబీడియోల్, దిశా పఠాని, యోగిబాబు తదితరులు
Director : శివ
Music Director : దేవీ శ్రీ ప్రసాద్
Release Date : 14/11/2024

దర్శకుడు శివ ఇంత వరకు రొటీన్ చిత్రాలతోనే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటి సారి తనలోని టెక్నికల్ నాలెడ్జ్, పాన్ ఇండియన్ విజన్‌ను బయటకు తీసి ‘కంగువా’ మూవీని తెరకెక్కించారు. సూర్య సైతం ఓ సరైన సబ్జెక్టుతో పాన్ ఇండియా స్పాన్‌లో రావాలని ఇన్నేళ్లు ఎదురుచూశాడు. అలా ఆ ఇద్దరి కలయికలో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో ఇవాళ రిలీజైన ‘కంగువా’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ

‘కంగువా’ కథ 1070 – 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్స్‌గా పని చేస్తాడు. ఏంజెలా (దిశా ప‌టానీ)దీ ఇదే ప‌ని. ఒక‌ప్పుడు వీరిద్దరూ ప్రేమికులే. ఆ త‌ర్వాత విడిపోయి ఎవ‌రి దారులు వాళ్లు చూసుకుంటారు. ఫ్రాన్సిస్, త‌న స్నేహితుడు (యోగిబాబు)తో క‌లిసి ఓ బౌంటీ హంటింగ్ ప‌నిపై ఉన్న‌ప్పుడే జీటా అనే బాలుడిని క‌లుసుకుంటారు. ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. ఆ త‌ర్వాత ఆ బాలుడి ప్రాణాల‌కి ప్ర‌మాదం ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి జీటాని కాపాడేందుకు ఫ్రాన్సిస్ ఎలాంటి సాహ‌సాలు చేశాడు? అస‌లు ఈ జీటాని వెంటాడుతున్నది ఎవ‌రు? ఫ్రాన్సిస్‌, జీటా, 1070 సంవ‌త్స‌రాల నాటి ప్ర‌ణవకోన యువ‌రాజు కంగువా (సూర్య‌)కి మ‌ధ్య సంబంధం ఏమిటి? ఈ విషయాలన్నీ తెరపైనే చూడాలి.

కథనం, విశ్లేషణ

వెయ్యేళ్ల కింద‌టి ఓ జాన‌ప‌ద కథ‌కి, వ‌ర్త‌మాన కాలానికి ముడిపెడుతూ తెర‌కెక్కించిన కథే ‘కంగువా’. లార్జ‌ర్ దేన్ లైఫ్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఓ భారీ కాన్వాస్‌తో రూపొందింది. అయితే ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా.. అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యరు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్‌ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్‌ అందరిలోనూ కలుగుతుంది.

క‌థ‌ని వ‌ర్త‌మానంతో ముడిపెట్టే క్ర‌మంలో తొలి 20 నిమిషాలపాటూ సాగే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి త‌ప్ప‌, అవి ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌వు. కంగువా క‌థతోనే అస‌లు సినిమా మొద‌ల‌వుతుంది. అప్ప‌ట్నుంచైనా ద‌ర్శ‌కుడు క‌థ‌పైన ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడా అంటే అదీ జ‌ర‌గ‌లేదు. ప్ర‌ణ‌వ‌కోన‌, క‌పాల కోన‌, సాగ‌ర కోన‌, అర‌ణ్య‌కోన‌, హిమ కోన అంటూ.. ఐదు వంశాలను ప‌రిచయం చేస్తూ గ‌జిబిజి వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. ఏ కోన‌తోనూ, మ‌రే వంశంపైనా ప్రేక్ష‌కులు ప్రేమ పెంచుకొనే అవ‌కాశం ద‌ర్శ‌కుడు ఇవ్వ‌లేదు. ప్ర‌ణ‌వ కోన ఎలాంటిదో మాటల్లో చెప్పి వదిలేశారంతే. నిజానికి ఇందులో క‌థ ప్ర‌ధానంగా ప్ర‌ణ‌వ కోన‌, క‌పాల కోన చుట్టూనే తిరుగుతుంది . ఆ రెండు వంశాల్నైనా పూర్తిగా ప‌రిచ‌యం చేసుంటే, ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కులకు చేరువ‌య్యేవి. ప్ర‌తి పాత్ర బిగ్గ‌ర‌గా అరుస్తూ క‌నిపిస్తుంది త‌ప్ప‌ వాటి ఉద్దేశం, వాటి తాలూకు భావోద్వేగాలు ప్రేక్ష‌కుడి మ‌న‌సుని తాక‌వు. అయితే కంగువా, పుల‌వ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు, ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య పండిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. పుల‌వ కుటుంబం కోసం కంగువా నిల‌బ‌డే తీరు, పుల‌వ‌ని కాపాడ‌టం కోసం త‌ను ఎంచుకునే దారి, రుధిర (బాబీడియోల్)తో పోరాటం త‌దిత‌ర స‌న్నివేశాలు సినిమాకి బ‌లాన్నిచ్చాయి. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి క్లైమాక్స్ హైలైట్‌. ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించడం సర్‌ప్రైజింగ్ గా అనిపిస్తుంది.

నటీనటులు

ఈ మూవీలో సూర్యది వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఎప్పటిలాగే ఈ మూవీలోనూ పీక్స్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. కంగువా, ఫ్రాన్సిస్ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు. రుధిర పాత్ర‌లో బాబీడియోల్ క‌నిపించిన తీరు మెప్పిస్తుంది కానీ, ఆ పాత్ర‌కి మ‌రింత ప్రాధాన్యం ద‌క్కాల్సింది. డైరెక్టర్ శివ బాబీదేవోల్ పాత్రను పేలవంగా రాసుకున్నారు. దిశా ప‌టానీ, యోగిబాబు పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం

నిర్మాణం పరంగా ఈ సినిమాలో హైలెవల్లో ఉంది. సాంకేతిక పరంగానూ సినిమా ఉన్నతంగా ఉంది. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్‌ఎక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఫర్వాలేదు. కానీ తాను రాసుకున్న కథను తెరపైన చూపించే విధానంలో డైరెక్టర్ శివ తడబడ్డాడు.

ప్లస్ పాయింట్స్

  • సూర్య నటన
  • యాక్షన్ సీన్స్
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

  • కథ, కథనం
  • బోర్ కొట్టించే కొన్ని సీన్లు
  • ఆకట్టుకోని కామెడీ

పంచ్ లైన్: ‘కంగువా’.. ఇది సూర్య వన్ మ్యాన్ షో!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button