తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘లక్కీ భాస్కర్’

Pakka Telugu Rating : 3.25/5
Cast : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సాయికుమార్, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్‌, టినూ ఆనంద్ తదితరులు
Director : వెంకీ అట్లూరి
Music Director : జీవీ ప్రకాశ్ కుమార్
Release Date : 31/10/2024

‘మహానటి’, ‘సీతారామం’ సినిమాల తర్వాత దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో ఒక మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేసేందుకు తెలుగు దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. భారీ అంచనాల మధ్య ఈ మూవీ దీపావళి కానుకగా ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ద్వారా దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారా? ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ

ఓ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఉద్యోగి అయిన హీరో తన కుటుంబ పోషణ కోసం చేసిన రిస్క్ ఏంటి, దాని ద్వారా వచ్చే ఇబ్బందుల్ని అతడు ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ కథ. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. చాలీచాలని జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా ఒక్కడిపైనే. భార్య సుమతి (మీనాక్షి చౌదరి)తో పాటు, కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు.. ఇలా అందరి బాధ్యతలూ తనవే. బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదనుకుంటాడు. మరి భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏమిటి? అది అతడికి ఇబ్బందుల్ని తెచ్చిపెట్టిందా లేక కష్టాల్ని దూరం చేసిందా? అనేది తెర పైన చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ

ఒక సాధారణ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్‌లో సాగే కథను తనదైన శైలిలో రాసుకుని, తెరకెక్కంచడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి సినిమా రాలేదని చెప్పుకోవాలి. 90ల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థని కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణం ఈ కథలో కీలకం. తెలివైన మోసాలతో కూడిన కథలు.. కాన్‌మెన్ జాన్రా పేరుతో ఇతర భాషల్లో విరివిగా సినిమాలు రూపొందుతుంటాయి. ఆ తరహా చిత్రమే ఇది. కథ, పాత్రలు, తెరపైన సంఘటనలు అన్నీ కూడా ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యేవే కావడంతో సినిమా ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే భాస్కర్ ప్రపంచంలో లీనమవుతాం. భాస్కర్‌పై జాలి కలిగేలా చేసిన దర్శకుడు.. ఆ తర్వాత తను ఏదో ఒకటి చేసి సమస్యల నుంచి గట్టెక్కాలనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. దాంతో తెరపైన కథానాయకుడు చేసే పనులన్నీ ప్రేక్షకులకు కిక్కునిస్తుంటాయి. రిస్క్ చేసి ఆంటోనీ (రాంకీ)కి సాయం చేయడం, ఆ తర్వాత అతనితోనే కలిసి మరో డీల్ కుదుర్చుకోవడం, ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని తెలివిగా అధిగమించే తీరు.. ఇలా ప్రతి మలుపూ ఆకట్టుకుంటుంది. స్టోరీ మొత్తం ఊహించినట్టే జరుగుతున్నా.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు భలే ఆకట్టుకుంటాయి. అయితే సెకండాఫ్‌లో మాత్రం కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. దలాల్ స్ట్రీట్ మాయాజాలం, షేర్లు, షెల్ కంపెనీలు కామన్ ఆడియన్‌కు పెద్దగా అర్థంకావనే చెప్పాలి.

నటీనటులు

ఈ మూవీలో దుల్కర్ సల్మాన్‌ది వ్యన్ మ్యాన్ షో అనే చెప్పాలి. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ‘సీతారామం’ మూవీ తరహాలోనే మలయాళ నటుడని భావన లేకుండా తన పెర్ఫార్మన్స్‌తో మెప్పించారు. ఈ సినిమాతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతారనిపిస్తుంది. ఇక గృహిణి పాత్రలో మీనాక్షి చౌదరి చాలా సహజంగా నటించారు. ఈ సినిమాతో మీనాక్షికి మంచి పాత్ర దక్కింది. భాస్కర్ కొడుకుగా రిత్విక్, సీబీఐ ఆఫీసర్‌గా సాయికుమార్‌తో సహా మిగతా నటులు రాంకీ, సచిన్ ఖేడేకర్‌, టినూ ఆనంద్, పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం

ఈ మూవీ జీవీ ప్రకాశ్ పూర్తిగా న్యాయం చేశారు. జీవీ బీజీఎం మూవీకే హైలెట్. “లక్కీ భాస్కర్” టైటిల్ సాంగ్ ఎంత క్యాచీగా ఉందో, నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ టెక్నిక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 80ల కాలం నాటి పరిసరాలను, పరిస్థితిలను రీక్రియేట్ చేసి, ఆడియన్స్‌ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో టీం సఫలమైంది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కంటెంట్‌ను నమ్మి ఖర్చుకి వెనుకాడకుండా దర్శకుడిని సపోర్ట్ చేసిన విధానం కూడా హర్షణీయం.

ప్లస్ పాయింట్స్

  • కథ
  • దుల్కర్ సల్మాన్ నటన
  • ట్విస్టులు

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్‌లో కొన్ని సీన్లు

పంచ్ లైన్: ‘లక్కీ భాస్కర్’.. ఇది దుల్కర్ సల్మాన్ గేమ్ షో!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button