తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: మత్తు వదలరా-2

Pakka Telugu Rating : 3/5
Cast : శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా
Director : రితేష్ రానా
Music Director : కాలభైరవ
Release Date : 13/09/2024

కీరవాణి కొడుకు శ్రీ సింహ 2019లో హీరోగా ‘మత్తు వదలరా’ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఏవీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ చేశాడు. ఈ మూవీ ట్రైలర్‌ను పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? చూద్దాం.

కథ

మత్తు వదలరా పార్ట్ 1కి కంటిన్యూగానే ఈ సినిమా సాగుతుంది. బాబు (శ్రీ సింహ), యేసు (సత్య) తమ డెలివరీ జాబ్స్ పోవడంతో ఓ యాడ్ చూసి HE టీమ్ లో జాబ్స్ సాధిస్తారు. HE (High in Emergency) టీమ్ కిడ్నాప్స్, మర్డర్స్.. లాంటి ఎమర్జెన్సీ కేసుల్ని డీల్ చేస్తుంది. ఇందులో బాబు, యేసు కలిసి కిడ్నాప్ కేసుల్ని డీల్ చేసి సక్సెస్ అవుతుంటారు. కానీ జీతం సరిపోకవడంతో కిడ్నాపర్స్ ని పెట్టుకున్నాక రికవరీ చేసిన డబ్బుల్లో కొంత నొక్కేస్తూ ఉంటారు. లైఫ్ టైం సెటిల్ అయిపోవాలని ఓ కిడ్నాప్ కేసుని HE టీమ్ కి తెలియకుండా వీళ్ళే డీల్ చేసి డబ్బులు మొత్తం నొక్కేద్దాం అనుకుంటారు. అలా రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని వీళ్ళు డీల్ చేస్తారు. కానీ వీళ్ళు కాపాడిన రియా ఫేక్ అని, అసలు రియాని వేరే వాళ్ళు చంపేసి వీళ్ళని అందులో ఇరికించినట్టు తెలుస్తుంది. అంతేకాక ఆకాష్(అజయ్)ని కూడా వీళ్ళే చంపినట్టు ఇరికిస్తారు. దీంతో HE టీమ్ వీళ్ళ వెంటపడుతుంది. అసలు రియాని ఎవరు చంపారు? రియా కేసు వీళ్ళ మీదకు ఎందుకు తోసారు? ఆకాష్ ని ఎవరు చంపారు? ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఉన్న లింక్ ఏంటి? బాబు, యేసులు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? వీరికి వాళ్ళ సీనియర్ నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలా సపోర్ట్ చేసింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ

మత్తు వదలరా సినిమా క్రైం సస్పెన్స్ కామెడీతో మెప్పించారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా క్రైం సస్పెన్స్ తో ఈసారి మరింత నవ్వించారు. ఫస్ట్ హాఫ్ అంతా బాబు, యేసులు కిడ్నాప్ ఆపరేషన్స్ చేయడంతో సాగి ఇంటర్వెల్ కి ముందు రియా హత్య కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ కేసుని బాబు, యేసు, నిధి కలిసి ఎలా సాల్వ్ చేసారు అని ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ ఆసక్తిగా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ ని మించి ఇందులో నవ్వించారు. ఇక సినిమా అంతా కమెడియన్ సత్య ఒక్కడే మోశాడని చెప్పొచ్చు. సత్య తన యాక్షన్స్ తో ఫుల్ గా నవ్విస్తాడు. ఫస్ట్ పార్ట్ లో చూపించిన సీరియల్ ఇందులో కూడా కథలో ఇన్వాల్వ్ అవుతూ కొనసాగుతుంది. ఆ సీరియల్ తో కూడా నవ్విస్తూనే చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే ఇందులో కూడా ఓ డ్రగ్ గురించి చూపించి కథకి దాన్ని బాగా కనెక్ట్ చేసారు. ఇక మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి హై ఫీలింగ్ ఇస్తుంది. తెరపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ కనపడి, వాళ్ళ రిఫరెన్స్ లు చూపించి మెప్పించారు. సెకండ్ హాఫ్ ట్విస్ట్ లు రివీల్ చేసేటప్పుడు కొన్ని సందేహాలు మాత్రం వస్తాయి. ప్రమోషన్స్ లో చెప్పినట్టు మత్తు వదలరా పార్ట్ 3 కూడా ఉండొచ్చు.

నటీనటులు

శ్రీ సింహ తన నటనతో మెప్పించాడు. ఇక సత్య కూడా కామెడీ ఏజెంట్ పాత్రలో సినిమాని తన భుజాలపై మోశాడు. ఫరియా అబ్దుల్లా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అలరించింది. సునీల్, వెన్నెల కిషోర్ కూడా తమ కామెడీతో నవ్వించారు. రోహిణి, రాజా.. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక వర్గం

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్రైం కామెడీ జానర్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఇచ్చి మెప్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసుకున్నారు. కథ, కథనం పార్ట్ 1 లాగే అనిపించినా ప్రేక్షకులని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు రితేష్ రానా. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • కామెడీ
  • శ్రీసింహా, సత్య నటన
  • ట్విస్టులు

మైనస్ పాయింట్స్

  • కొన్ని చోట్ల సీన్ల సాగదీత

పంచ్ లైన్: ‘నవ్విస్తూ మత్తు వదిలిస్తారు!’

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button