మూవీ రివ్యూ: ‘పుష్ప-2: ది రూల్’
Pakka Telugu Rating : 4/5
Cast : అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల, ఫహద్ ఫాజిల్, తారక్ పొన్నప్ప, జగపతిబాబు, రావు రమేశ్, జగదీశ్, సునీల్, అనసూయ
Director : సుకుమార్
Music Director : దేవీ శ్రీ ప్రసాద్
Release Date : 05/12/2024
ది బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ మూవీ ‘పుష్ప-2: ది రూల్’ ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దేశవ్యాప్తంగా నిన్న రాత్రి 9.30 గంటలకే ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబోలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా 11,500లకు పైగా స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ
‘పుష్ప: ది రైజ్’ పార్ట్ 1కి కొనసాగింపుగానే పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్ర చందనం సిండికేట్‌లో రారాజుగా ఎదుగుతాడు. తన దారికి ఎవ్వరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండ్‌గా మార్చేస్తాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు. అయితే పుష్ప బయట ఫైర్ కానీ.. ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫొటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదాని.. ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు (రావు రమేష్)తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? మరోపక్క పుష్పపై కోపంతో రగిలిపోతున్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరి షెకావత్‌ని ఢీ కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కీ, పుష్పకీ సంబంధం ఏంటి? అది వైరంగా ఎలా మారింది? ఇక, పుష్ప తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్ (అజయ్) నుంచి తెచ్చుకోగలిగాడా? ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది?
అన్నది తెరపైనే చూడాలి.
కథనం, విశ్లేషణ
‘పుష్ప-1’ అల్లు అర్జున్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజంపైనే దృష్టిపెట్టిన డైరెక్టర్ సుకుమార్ ఈసారి కథ పరిధి పెంచారు. ‘పుష్ప’ ప్రపంచాన్ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేశారు. ముఖ్యంగా పుష్ప రోల్‌ని మరింత స్ట్రాంగ్‌గా చూపించే సన్నివేశాలైతే మాస్ ఆడియెన్స్‌కి ఫుల్‌గా ఎక్కేస్తాయి. ఇక, నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లోనూ ఫర్‌ఫెక్ట్ డోస్ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన తీరు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అడుగడుగునా ఎలివేషన్స్‌తో కట్టిపడేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు, డైరెక్టర్ సుకుమార్ కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్‌ని ఎలివేట్ చేసిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సీక్వెల్.. ఆ అంచనాలు రీచ్ అయ్యే మాసివ్ సీక్వెన్స్‌లతో దుమ్ము లేపే హై మూమెంట్స్‌తో నిండి ఉందని చెప్పాలి. అల్లు అర్జున్‌పై ఒక్కో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టించదు.
ఎస్పీ షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విడిపించడం, మొదలుకుని సీఎం దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకూ సాగే సన్నివేశాలతో పుష్ప పాత్రలోని హీరోయిజం ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ వంద కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్. పుష్ప, షెకావత్ ఒకరికొకొరు వేసే ఎత్తులు పైఎత్తులు ప్రేక్షకుడిలో తీవ్ర ఆసక్తిని పెంచేస్తాయి. ఇదంతా ఒకెత్తైతే, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ మరో ఎత్తు. పుష్ప.. షెకావత్‌కి ఊహించని రీతిలో ఝలక్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ఇక, మూవీలో ఎమోషన్స్ డోస్ కూడా ఎక్కడా తగ్గలేదు. కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్లిద్దరి మధ్య ప్రేమ, సన్నివేశాలు హైలెట్. భర్త.. భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని మెయిన్ స్టోరీతో లింక్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఫహాద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు, అందులో తన నటన వెర్సటాలిటీని చూపిస్తాయి.
ఇక, సెకండాఫ్.. ఫస్టాఫ్ అంతా సుకుమార్ మార్క్ మేకింగ్ కనిపిస్తే సెకండాఫ్ మొత్తం బన్నీనే కనిపిస్తాడు. నిజానికి బన్నీ సుకుమార్ డైరెక్షన్‌నే డామినేట్ చేశాడేమో అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా జాతర సీన్‌లో అల్లు అర్జున్ చీర కట్టుకొని చేసిన పెర్ఫామెన్స్ నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ దెబ్బతో మరో నేషనల్ అవార్డు వచ్చినా రావొచ్చు. ఇక, ఇదే జాతర సీన్‌లో రష్మిక యాక్టింగ్ విజిల్స్ కొట్టించడం ఖాయం. ఆ తర్వాత రెండు వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని పుష్పరాజ్.. రాష్ట్రం, దేశం సరిహద్దుల్ని దాటించే ఎపిసోడ్ రక్తి కట్టిస్తుంది. కొత్తరకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే మూవీకే హైలెట్. యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా మెడలు కొరుకుతూ చేసే క్లైమాక్స్ ఫైట్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఓ ఆసక్తికర మలుపుతో ‘పుష్ప-3: ది ర్యాంపేజ్’ కు బాటలు వేసిన తీరు ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలో ఇంప్రెస్ చేయని అంశమంటూ ఏదీ లేదు కానీ డీప్‌గా అబ్జర్వ్ చేస్తే కథలో బలమైన విలనిజం కనిపించదు. షెకావత్ పాత్రని పరిచయం చేయడంలో ఉన్నంత బిల్డప్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ హీరో-విలన్ మధ్య వచ్చే సీన్లన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలు కూడా సాదాసీదాగా సాగినట్లు అనిపిస్తుంది.
నటీనటులు
అల్లు అర్జున్: పుష్ప-1తో పోల్చితే ఇందులో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపం చూపించారు. జాతర సీన్‌లో చీరకట్టుకొని చేసిన ఫర్‌ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ దెబ్బతో మరో నేషనల్ అవార్డు కూడా రావొచ్చనిపిస్తుంది. డ్యాన్స్, ఫైట్స్ కూడా అదగొట్టేశారు. అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్‌లో విలన్స్ మెడలు కొరుకుతూ ఉగ్రరూపం ప్రదర్శించారు.
రష్మిక: అల్లు అర్జున్-రష్మికల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎమోషన్ సీన్లలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో ఆమె నటన విజిల్స్ కొట్టిస్తుంది. పీలింగ్స్, సూసేకి పాటల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక కూడా డాన్స్ ఇరగదీసింది.
శ్రీలీల: ‘కిస్సిక్’ పాటతో మెరిసిన శ్రీలీల డ్యాన్స్‌తో దుమ్మురేపింది. అందంతోనూ ఆకట్టుకుంది. ఈ పాటకు థియేటర్లు విజిల్స్‌తో మారుమోగడం ఖాయం.
ఫహద్ ఫాజిల్: షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. అయితే ఆయన పాత్రలోని విలనిజాన్ని ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండేది.
రావురమేశ్, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప, జగపతిబాబు, జగదీశ్, సునీల్, అనసూయ చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం
సినిమాకు ప్రధాన ఆకర్షణ సాంగ్స్, బీజీఎం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ వందకు వంద శాతం న్యాయం చేశారు. పీలింగ్స్, సూసేకి, కిస్సిక్ పాటలు థియేటర్‌లో విజిల్స్ కొట్టిస్తాయి. మరో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ కూడా బీజీఎంలో కీలక పాత్ర పోషించారు. ఇక, సినిమాటోగ్రాఫర్ కూబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. ప్రతి సీన్‌లో రిచ్‌నెస్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- అల్లు అర్జున్ నటన, యాక్షన్ సీన్స్
- డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే
- జాతర సీన్
- క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్
- బలమైన విలనిజం లేకపోవడం (కానీ పెద్దగా మైనస్ అనిపించదు!)
- మంగళం శీను, ద్రాక్షాయని పాత్రలు సాదాసీదాగా సాగడం
పంచ్ లైన్: పుష్ప-2… ఫైర్ కాదు.. వైల్డ్ ఫైరే..!