తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘సరిపోదా శనివారం’

Pakka Telugu Rating : 3/5
Cast : నాని, ఎస్.జె. సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్, సాయికుమార్, మురళిశర్మ, అదితి బాలన్ తదితరులు
Director : వివేక్ ఆత్రేయ
Music Director : జేక్స్ బిజోయ్
Release Date : 29/08/2024

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్ గతంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ మూవీలో కామెడీ, ట్విస్టులు బాగానే ఉన్నా.. మాస్ ఆడియన్స్‌ని మాత్రం ఇది ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ ఇద్దరు మరోసారి ప్రయత్నించారు. నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇవాళ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ

సూర్య (నాని)కి చిన్న‌ప్ప‌ట్నుంచీ కోపం ఎక్కువ‌. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం త‌ను చ‌నిపోతూ ఓ మాట తీసుకుంటుంది త‌ల్లి ఛాయాదేవి (అభిరామి). అప్ప‌ట్నుంచి వార‌మంతా ఎంత కోపం వ‌చ్చినా నియంత్రించుకుంటూ, శ‌నివారం మాత్ర‌మే త‌న కోపానికి కార‌ణ‌మైన‌ వాళ్ల ప‌ని ప‌డుతుంటాడు. వార‌మంతా చిత్ర‌గుప్తుడులా చిట్టా రాసుకుంటూ, శ‌నివారం య‌ముడిలా చెల‌రేగిపోతాడ‌న్న మాట‌. దాంతో ఆ గొడ‌వ‌లు ఇంటిదాకా వ‌స్తుంటాయి. తండ్రి (సాయికుమార్‌), అక్క (అదితి) ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటారు. ఎన్‌.ఎల్‌.ఐ.సిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సీఐ ద‌యానంద్ (ఎస్‌.జె.సూర్య‌) చేర‌తాడు. త‌న సొంత అన్న కూర్మానంద్ (ముర‌ళీశ‌ర్మ‌)తోనే వైరం ఉన్న సీఐ ద‌యానంద్ క‌థేమిటి? అత‌నికీ, సోకుల‌పాలెం అనే ఊరికీ సంబంధ‌మేంటి? ద‌యానంద్‌పై సూర్య‌కు ఉన్న కోపం, సోకుల‌పాలేనికి ఎలాంటి మేలు చేసింది? వీళ్ల క‌థ‌లోకి చారులత (ప్రియాంక మోహ‌న్‌) ఎలా ప్ర‌వేశించింది? అన్నది చిత్ర కథ!

కథనం-విశ్లేషణ

వివేక్ ఆత్రేయ మామూలుగానే చాలా తెలివైన డైరెక్టర్లలో ఒకరు. కాబట్టి తెలివైన క‌థ‌నంతో సాగే ఓ యాక్ష‌న్ డ్రామా ఇది. విడుద‌ల‌కు ముందు చిత్ర‌బృందం కూడా క‌థ కంటే, ఆ క‌థ‌ని ఎలా చెప్పామ‌న్న‌దే కీల‌కం అంటూ ప్ర‌చారం చేసింది. అందుకు త‌గ్గ‌ట్టే బ‌ల‌మైన పాత్ర‌లు, సంఘ‌ర్ష‌ణకి వైవిధ్య‌మైన క‌థనాన్ని మేళ‌వించి ‘సరిగ్గా స‌రిపోయింది’ అనిపించేలా చిత్రాన్ని మ‌లిచే ప్ర‌య‌త్నం చేశాడు దర్శకుడు. ఏ కథ అయినా అమ్మ నుంచే మొద‌ల‌వుతుందంటూ అమ్మ, ఆమె త‌న కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. క‌థ‌, పాత్ర‌ల ప‌రిచ‌యంతో కూడిన ఆరంభ స‌న్నివేశాలు కాస్త నెమ్మ‌దిగా అనిపించినా, ద‌యా పాత్ర ప్ర‌వేశంతో అస‌లు క‌థ ఊపందుకుంటుంది. సోకుల‌పాలెంలో ధైర్యం నింప‌డం కోసం సూర్య‌, చారు క‌లిసి ఓ వ్యూహాన్ని ర‌చించ‌డం, ఆ క్ర‌మంలో అనూహ్యంగా చోటు చేసుకునే సంఘ‌ట‌న‌లు, సూర్య ఇంట్లో సాగే పోరాట ఘ‌ట్టాలు ఆక‌ట్టుకుంటాయి. కోపం న‌లుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ ప‌తాక స‌న్నివేశాల దిశ‌గా సినిమా సాగుతుంది.

నటీనటులు

‘దసరా’ తర్వాత హీరో నాని యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇందులో సూర్య పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఉద్యోగిగా స‌హ‌జ సిద్ధ‌మైన లుక్‌, న‌ట‌నతో ఒక‌వైపు అల‌రిస్తూనే, మ‌రోవైపు కోపంతో రగిలిపోయే కోణాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఎస్‌.జె.సూర్య పోషించిన ఇన్‌స్పెక్ట‌ర్ ద‌యానంద్ పాత్ర సినిమాకి కీలకం. క్రూర‌త్వం ప్ర‌ద‌ర్శిస్తూ, త‌న చూపుల‌తోనే భ‌య‌పెడుతూ విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు. ఆ పాత్ర‌కి స‌రైన ఎంపిక అని చాటి చెప్పారు. చారుల‌త పాత్ర‌లో ప్రియాంక మోహ‌న్ అల‌రిస్తుంది. సాయికుమార్‌, అదితి బాల‌న్‌, అభిరామి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, అజ‌య్ త‌దిత‌రులు పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అయితే, పాటలు మాత్రం బ్యాక్ గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి. ఇక, జేక్స్ బిజోయ్ నేప‌థ్య సంగీతంతో సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావం చూపించాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ త‌న మార్క్ యాక్ష‌న్ ప్ర‌ధాన‌మైన సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. పాత్ర‌ల ర‌చ‌న‌, క‌థ‌నాన్ని మ‌లిచిన తీరు ఈ సినిమాకి హైలైట్‌.

ప్లస్ పాయింట్స్

  • నాని, సూర్య నటన
  • బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

  • కొన్ని సీన్ల సాగదీత

పంచ్ లైన్: ‘సరిపోయీ సరిపోనట్టుగా ఉంది!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button