తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: సత్యదేవ్ ‘జీబ్రా’

Pakka Telugu Rating : 3.25/5
Cast : సత్యదేవ్, డాలి ధనంజయ, ప్రియా భవానీ శంకర్, సునీల్, సత్య
Director : ఈశ్వర్ కార్తిక్
Music Director : రవి బస్రూర్
Release Date : 22/11/2024

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా హీరోగా మాత్రం ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయారు. అయితే ఆయన నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’తో ఆ కల నెరవేరి తీరుతుందని సత్యదేవ్ గట్టిగా నమ్మారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడంతో ఇంకొంత బజ్ క్రియేట్ అయ్యింది. ఇది తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుందని సత్యదేవ్ ప్రచారం కూడా చేశారు. మరి ఆయన అంచనాలు ఫలించాయా? ‘జీబ్రా’ మూవీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ

సూర్య (సత్యదేవ్) బాట్ అనే బ్యాంక్‌లో రిలేషన్షిప్ మేనేజర్. తన జీతం కూడబెట్టుకొని ఓ సొంత ఇల్లు కొనుక్కొని స్వాతి (ప్రియా భవానీ శంకర్)ని పెళ్లి చేసుకోవాలనేది సూర్య కల‌. స్వాతి కూడా ఓ బ్యాంకు ఉద్యోగే. అనుకోకుండా ఓ రోజు స్వాతి చేసి చిన్న త‌ప్పు వ‌ల్ల‌ ఓ వ్యక్తి వేసిన చెక్ రాంగ్ ఎకౌంట్‌లో డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి బ్యాంక్ దగ్గరకి వచ్చి ఎలాగైనా తన డబ్బు వెంటనే ఇప్పించాలని పట్టుబడతాడు. విషయం తెలుసుకున్న సూర్య కొన్ని లూప్ హోల్స్‌ని వాడుకొని ఏదోలా ఆ డబ్బుని సర్దేస్తాడు. ఇంతలో ఓ ఐదు కోట్ల రుపాయిలు సూర్య పేరుతో ఉన్న ఎకౌంట్‌లో జమ అవుతాయి. వెంటనే ఆకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అసలు ఇంత డబ్బు తన పేరు మీద ఉన్న నకిలీ ఎకౌంట్‌లోకి ఎలా వచ్చిందో సూర్యకు అంతుచిక్కదు. ఇంతలో ఆది (డాలీ ధనంజయ) అనే గ్యాంగ్ స్టర్ ఆ ఐదు కోట్లు తనవేనని, నాలుగు రోజుల్లో ఆ డబ్బుని తన అకౌంట్‌కి ట్రాన్స్ ఫర్ చేయాలని డెడ్ లైన్ పెడతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు సూర్య పేరుతో నకిలీ అకౌంట్ తెరచింది ఎవరు? ఆ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయ్యింది? లక్షల కోట్లకు అధిపతైన గ్యాంగ్ స్టర్ ఆది ఓ ఐదు కోట్ల కోసం సూర్య వెంట ఎందుకు పడ్డాడు? ఆ డబ్బుని సూర్య వెనక్కి తీసుకురాగలిగాడా? ఇవన్నీ తెరపైనే చూడాలి.

కథనం, విశ్లేషణ

బ్యాంకుల చుట్టూ తిరిగే కథలు ఈ మధ్య కాలంలో చాలానే వచ్చాయి. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సర్కారు వారి పాట’, తర్వాత దుల్కర్ సల్మాన్‌తో వెంకీ అట్లూరీ ‘లక్కీ భాస్కర్’ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.అయితే ‘జీబ్రా’ మాత్రం వీటికి పూర్తిగా డిఫరెంట్. తాను రాసుకున్న కథను, టైట్ స్క్రీన్‌ ప్లేతో డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్, ట్విస్టులు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. బ్యాంక్ లూప్ హోల్స్ చుట్టూ సాగే కథనం సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బ్యాంక్ రిలేషన్షిప్ మ్యానేజర్ సూర్య తన పాయింట్ వ్యూ నుంచి ఈ కథని ఆసక్తికరంగానే మొదలుపెడతాడు. ముఖ్యంగా చెక్ రాంగ్ డిపాజిట్ తర్వాత బ్యాంక్‌లోని లూప్ హోల్స్‌ని వాడుకొని ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం చూసినప్పుడు దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ బ్యాంకింగ్ వ్యవస్థని నమిలిమింగేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. మున్మందు ఇంకెన్ని మలుపులతో కథని ముందుకు తీసుకెళ్తాడో అనే క్యురియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే గ్యాంగ్ స్టర్ ఆది, మనీ లాండరింగ్ కోణంలో గుప్తా (సునీల్) పాత్రలు ప్రవేశించిన తర్వాత కథ ఒక్కసారిగా మందగిస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే బ్యాంగ్ మనీ హీస్ట్ ఎపిసోడ్ ఎక్సయిటింగ్‌గా తీశారు. నిజంగా ఇలా సాధ్యమౌతుందా అనే ప్రశ్న తొలుస్తున్నా ఆ గేమ్ ప్లాన్ ఆసక్తికరంగా మలిచారు. అక్కడ వచ్చే మలుపులు అలరిస్తాయి.

నటీనటులు

హీరో సత్యదేవ్ ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తారు. ఇందులోనూ తన స్టైల్‌లోనే సూర్య క్యారెక్టర్‌ని చేశారు. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలతో పోల్చుకుంటే కూల్ అండ్ ఫన్ ఫుల్ క్యారెక్టర్ ఇది. ఇక డాలీ ధనంజయ ఫుల్ స్వాగ్‌తో కనిపించారు.ఇక, ఫుల్ ఫామ్‌లో ఉన్న కమెడియన్ సత్య ఈ మూవీలోనూ తన మార్క్‌ని కామెడీని పండించారు. మనీ హీస్ట్ ఎపిసోడ్‌లో సత్య కామెడీ హైలెట్‌గా నిలుస్తుంది. ప్రియా భవానీ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. సునీల్ పాత్రని కొత్తగా డిజైన్ చేశారు. అయితే ఏ పాత్రలో అయినా అద్భుతంగా నటించే సత్యరాజ్‌కి మాత్రం తన సామర్థ్యానికి తగ్గ పాత్ర దక్కలేదు. ఆయన పాత్ర నిడివి కూడా తక్కువగా ఉంది.

సాంకేతిక వర్గం

సాంకేతికపరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. బ్యాంకింగ్ టెర్మినాలజీ అర్థంకాకపోయినా అందులోని లూప్ హోల్స్ చూపించేటప్పుడు ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టదు. పైగా ఆసక్తిగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం బ్యాంక్ సెట్ వేశారు. అది సహజంగా కుదిరింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇక, పాటలు యావరేజ్ అనే చెప్పాలి. ఆర్ఆర్‌లోనూ రవిబస్రూర్ మార్క్ అంత కనిపించదు.

ప్లస్ పాయింట్స్

  • కథ, కథనం
  • సత్యదేవ్, ధనంజయ నటన
  • సత్య కామెడీ

మైనస్ పాయింట్స్

  • సాంగ్స్, బీజీఎం

పంచ్ లైన్: ‘జీబ్రా’.. బొమ్మ సూపర్ హిట్..!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button