తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ
Trending

మూవీ రివ్యూ: ‘సత్యం, సుందరం’

Pakka Telugu Rating : 3/5
Cast : కార్తి, అరవింద స్వామి, కిరణ్‌, దివ్య, జయ ప్రకాశ్‌ తదితరులు
Director : ప్రేమ్‌ కుమార్‌
Music Director : గోవింద్ వసంత్‌
Release Date : 28/09/2024

తమిళ స్టార్‌ హీరోలు కార్తి, అరవింద్‌ స్వామి కలిసి నటించిన చిత్రం ‘సత్యం సుందరం’ . డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక దంపతులు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

కథ

సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. అతనికి ఆ ఊరన్నా.. అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం. కొందరు బంధువులు చేసిన మోసం వల్ల సత్యం యుక్తవయసులో ఉన్నప్పుడే వాళ్ల కుటుంబం ఆ ఇల్లు కోల్పోతుంది. దీంతో వాళ్లు ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వచ్చి స్థిరపడతారు. ఈ క్రమంలోనే 30 ఏళ్లు గడిచిపోతాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యంను తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సత్యం ఉద్దండరాయుని పాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతన్ని బావా అని ఆప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి (కార్తి) తారసపడతాడు. నిజానికి అతనెవరు.. తన పేరేంటన్నది సత్యం గుర్తుపట్టకున్నా.. మొహమాటం కొద్దీ తను పరిచయమున్నట్లుగానే నటిస్తూ వస్తాడు. మొదట్లో అతని అతి వాగుడు.. మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనని జిడ్డులా భావిస్తాడు సత్యం. కానీ, కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది?ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా?లేదా? అన్నది తెర పైనే చూడాలి.

కథనం, విశ్లేషణ

జీవితంలో చవిచూసిన ఇబ్బందుల వల్ల కొన్ని సందర్భాల్లో మనమేంటో మనమే మరచిపోతుంటాం. అయినవారికి దూరంగా ఉంటాం. నలుగురి తోడుకి దూరమవుతాం. అయితే మన ప్రమేయం లేకుండా మన వల్ల వేరొకరి జీవితంలో జరిగే మంచి ఒక్కోసారి మనమేంటో మనకు తెలియజేస్తుంది. చేసిన తప్పుల్ని సరి చేస్తుంది. అలాంటిదే ఈ కథ. మట్టివాసనలు పులుముకుని.. బోలెడన్ని జ్ఞాపకాలు, భావోద్వేగాల్ని నింపుకొన్న ఓ అందమైన జీవిత ప్రయాణంలా సాగింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ హంగులకు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే చిత్రమిది. సినిమాని ఆరంభించిన తీరు.. సాగిన విధానం.. ముగింపు అన్నీ ఓ ప్రశాంతమైన నదిలా అలా కదిలిపోతాయి. ఆ ప్రవాహంలోనే ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రేక్షకుల్ని ఓలలాడిస్తూ మూడు గంటల పాటు గతంలోకి తీసుకెళ్లిపోయారు దర్శకుడు. సత్యం ఊరి వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలోనే తనకు ఊరితోనూ.. అక్కడున్న తన ఇంటితోనూ ఉన్న అనుబంధాన్ని పరిచయం చేసి ఆరంభంలోనే కథకు తగిన ఎమోషనల్‌ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు. కార్తి పాత్ర పరిచయం, అల్లరి.. తనెవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు.. అతని పేరు తెలుసుకోవడానికి పడే తిప్పలు.. అన్నీ సరదాగా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ కార్తి ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఆ ఇంటికి వెళ్లాక సత్యానికి ఎదురయ్యే అనుభవాలు మనసుల్ని హత్తుకుంటూనే నవ్వులు పూయిస్తాయి.

సీన్లుగా చూసుకుంటే.. చెల్లెలు భువన పెళ్లికి తనకు ఎంతో ఇష్టమైన వస్తువులు గిఫ్ట్‌గా తెచ్చి వేదికపై ఇస్తూ… గాజులు తొడిగి, పెళ్లి వేదికపై నేల పై కూర్చుని కాళ్లకు పట్టీలు పెట్టే సన్నివేశం ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా ఉంది. ఉంది. ఆ సన్నివేశంలో మన కళ్లకు తెలియకుండానే కళ్లు చెమర్చుతాయి. అలాగే కార్తి సైకిల్‌ గురించి చెప్పే సన్నివేశం, దాని తాలుక జ్ఞాపకాలు, దాని వల్ల జరిగిన మంచి, ఇంట్లో పెంచుకునే గిత్త గురించి చెప్పే సీన్‌, బావా అని పిలిచే వ్యక్తి పేరు తెలుసుకోవడం కోసం అరవింద్‌ స్వామి పడే తపన, అసలు కార్తి పేరు ఏంటి? చిన్నతనంలో సత్యం, కార్తి పాత్రకు మధ్య ఎలాంటి మధుర జ్ఞాపకాలున్నాయి అని గుర్తు చేస్తే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఒక్కసారిగా చిన్నతనంలోకి తీసుకెళ్తాయి. సినిమా టైటిల్‌లోనే కార్తి పేరు ఏంటో తెలుసు. కానీ కథ నడుస్తున్న క్రమంలో అది తెలియకుండా అతని పేరు ఏంటో తెలుసుకోవాలనే ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేశాడు దర్శకుడు.

నటీనటులు

కథల విషయంలో హీరోలకు ఎంతో అభిరుచి ఉంటే తప్ప ఇలాంటి స్క్రిప్ట్‌లు తెరపైకి రావు. ఈ విషయంలో కథలోని బలాన్ని నమ్మి దీన్ని చేయడానికి ముందుకొచ్చిన కార్తి సహా అరవింద్ స్వామిల సాహసాన్ని మెచ్చుకోవాలి. ఈ చిత్రంలో వాళ్లతో పాటు మిగిలిన తారాగణమంతా ఆయా పాత్రల్లో పూర్తిగా జీవించేశారు. తెరపై నిజ జీవిత కథను చూస్తున్నామా అన్నట్లు ప్రేక్షకుల్ని భ్రమింపజేసేలా సహజ సిద్ధమైన నటనను కనబరిచారు. కార్తి పాత్ర ఓవైపు నవ్విస్తూనే భావోద్వేగ భరితంగా సాగితే.. అరవింద స్వామి సెటిల్ట్‌గా ఒకే మూడ్‌లో కనిపిస్తూ పతాక సన్నివేశాల్లో భావోద్వేగ భరితమైన నటనతో కట్టిపడేశారు.

సాంకేతిక వర్గం

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ క్రియేట్‌ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్‌ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

  • కథ
  • కార్తి, అరవింద స్వామి నటన

మైనస్ పాయింట్స్

  • లేవు

పంచ్ లైన్: ‘సత్యం సుందరం’.. ఓ అందమైన అనుభూతినిచ్చే జీవిత ప్రయాణం!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button