మూవీ రివ్యూ: ‘ది గోట్’
Pakka Telugu Rating : 2.5/5
Cast : దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్‌జీ తదితరులు
Director : వెంకట్ ప్రభు
Music Director : యువన్ శంకర్ రాజా
Release Date : 05/09/2024
తమిళ దళపతి విజయ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటారు. అందుకు తగ్గటే విజయ్ కూడా తన ఫ్యాన్స్‌ని ఎప్పుడూ నిరాశపర్చకుండా కొత్త కొత్త కథల్ని ఎంచుకుంటూ ఉంటారు. ఇక, ఆయన రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత విడుదలైన సినిమా ‘ది గోట్’. పైగా ఇదే విజయ్ ఆఖరు సినిమా అంటూ కూడా ప్రచారం జరిగింది. దాంతో ఈ సినిమాకు తమిళనాట అంచనాలు అవధులు దాటిపోయాయి. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. వెంకట్ ప్రభు లాంటి క్రియేటర్ ఈ సినిమాకు దర్శకుడు కావడం, విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు రావడంతో భారీగా హైప్ వచ్చింది. మరి ప్రేక్షకులను విజయ్ తన ఆఖరి సినిమాతో ఎంతవరకు మెప్పించారో ఓసారి చూసేద్దాం.
కథ
గాంధీ (విజయ్) నిజాయితీ పరుడు. ఇండియా తరఫున స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్‌లో అతనో రహస్య ఉద్యోగి. ఓ మిషన్‌పై కెన్యాలో తన మిత్రుడితో కలిసి చేసిన ఓ ఆపరేషన్‌లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్ (మైక్ మోహన్)ని అనుకోకుండా చంపేస్తాడు. ఆ తర్వాత మరో మిషన్ మీద తన భార్య అను(స్నేహ), తన కుమారుడు జీవన్‌తో కలిసి మరో దేశానికి వెళ్తాడు. అక్కడ ఊహించని పరిణామాలు గాంధీకి ఎదురువుతాయి. కొన్ని పరిస్థితుల కారణంగా గాంధీకి కొడుకు జీవన్ దూరమవుతాడు. దూరమైన జీవన్ ఏమయ్యాడు? ఎలా పెరిగాడు? తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
కథనం-విశ్లేషణ
ఇది కొత్త కథేం కాదు. చిన్నప్పుడు హీరో కొడుకు తప్పిపోయి విలన్ దగ్గర పెరిగి హీరో మీదకే రావడం గతంలో మనం అనేక సినిమాల్లో చూశాం. కానీ సీక్రెట్ మిషన్స్ నేపథ్యంలో కథనం చూపించారు. దీంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో డిఫరెంట్ స్క్రీన్ ప్లేకి అవకాశం ఉన్నా కథ ఒకే లైన్‌లో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ గాంధీ గురించి, గాంధీ చుట్టూ పక్కల పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడం, కొడుకు తప్పిపోవడం పెద్దయ్యాక కొడుకు మళ్లీ తిరిగి రావడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి గాంధీ కొడుకే విలన్ అని ఆడియన్స్ కి తెలిసేలా చూపించినా ఇది ఆడియన్స్ ముందే పసిగడతారు. ఇక సెకండ్ హాఫ్ గాంధీ, జీవన్ మధ్యలో జరిగే సంఘటనలు ఎత్తుకుపైఎత్తు అన్నట్టు సాగుతాయి. గాంధీ తన కొడుకే విలన్ అని ఎలా కనిపెట్టాడు, ఏం చేసాడు అనేది కొంచెం ఆసక్తిగానే చూపించారు. సినిమా నిడివి 3 గంటలు కావడంతో చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు ఉంటుంది. కానీ విజయ్ ఫ్యాన్స్‌కి మాత్రం మూవీ నచ్చుతుంది. ఇక రెగ్యులర్ కథే కావడం, ట్విస్ట్‌లు ముందే ఊహించడం వంటివి సాధారణ ఆడియన్స్ ని కాస్త డిసాప్పాయింట్ చేస్తాయి. అయితే, క్లైమాక్స్ మాత్రం బాగుంది. ఓ పక్క క్రికెట్, ఓ పక్క యాక్షన్ సీన్స్ కంపారిజాన్ చేస్తూ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
నటీనటులు
విజయ్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పాత్ర ఏదైనా ఆయన పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఇందులోనూ అంతే. పొంతన లేని రెండు పాత్రల్లో అద్భుతంగా నటించాడు. అలాగే స్నేహ కూడా తన నటనతో ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి అందాల ఆరబోతకే పరిమితం అయ్యింది. ప్రభుదేవా, జయం రవి, ప్రశాంత్ పరిధి మేరకు నటించారు. త్రిష, శివకార్తీకేయన్‌ల సెడన్ ఎంట్రీ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాయి.
సాంకేతికవర్గం
విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు. కానీ పాటలు మాత్రం బాగాలేవు. కాకపోతే యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదని పించింది. అయితే, దర్శకుడిగా వెంకట్ ప్రభు ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించాడు. కానీ ఈ సినిమాలో అతని మార్క్ కనిపించలేదని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్
- విజయ్ నటన
- క్లైమాక్స్
- యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ
- నిడివి
- ట్విస్టులు లేకపోవడం
పంచ్ లైన్: ‘ది గోట్’ ఫ్యాన్స్‌కి మాత్రమే ఫీస్ట్!