మూవీ రివ్యూ: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’
Pakka Telugu Rating : 3/5
Cast : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష
Director : రవితేజ ముళ్లపూడి
Music Director : జేక్స్ బిజోయ్
Release Date : 22/11/2024
హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలు ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గానే నిలిచాయి. ఇక, తాజాగా ఇదే ఏడాదిలోనే తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విశ్వక్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా ఈ యంగ్ హీరో హిట్ కొట్టాడో లేదో రివ్యూలో చూద్దాం.
కథ
రాకేశ్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి తన తండ్రి రామకృష్ణ (నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా సెటిల్ అయిపోతాడు. గ్యారేజ్‌లో రిపేర్లు చేయడంతోపాటు.. డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ (శ్రద్ధా శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి) వస్తారు. అయితే ప్రియ ఎవరో కాదు, రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియ. తన స్నేహితుడి చెల్లెలు కూడా. వీళ్లిద్దరి మధ్య ప్రేమప్రయాణం మొదలు అనుకునేలోపే నాటకీయ పరిణామాలతో కళాశాల వదిలేయాల్సి వస్తుంది రాకీ. డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసిన ప్రియ గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేమిటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? వాళ్లిద్దరి జీవితాల్ని మాయ ఎలా ప్రభావితం చేసింది? ఈ విషయాలన్నీ తెరపైన చూడాల్సిందే.
ALSO READ: మూవీ రివ్యూ: సత్యదేవ్ ‘జీబ్రా’
కథనం, విశ్లేషణ
మొదట్లో చూడ్డానికి ఇది ట్రైయాంగిల్ కథలాగా అనిపించినా కథ మొదలయ్యాక డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దీనిని వేరే జానర్‌లోకి తీసుకెళ్లిపోయాడు. నిజానికి నేర సామ్రాజ్య నేపథ్యంలో సాగే ఫక్తు థ్రిల్లర్ సినిమా. అంతేకాదు, సమకాలీన సమాజంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఓ అంశం చుట్టూ ఈ కథ తిరిగింది. అయితే చాలా సీరియస్‌గా కథనాన్ని నడిపించాల్సిన ఈ మూవీకి కమర్షియల్ హంగులు అద్దడంతో ఫస్టాప్ కాస్త తేలిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో విశ్వక్‌సేన్ ఓల్డ్ గెటప్, ఆ గెటప్‌లో సన్నివేశాలు ఆడియన్స్‌కి ఇరిటేషన్ తెప్పిస్తాయి. కామెడీ కూడా పెద్దగా పేలలేదు. అయితే, విశ్వక్ – మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ బాగుంది. ఇక, ఫస్టాఫ్ కాస్త భరించాలన్నట్లు అనిపించినా సెకండాఫ్‌కి వచ్చేసరికి పైసా వసూల్ అయిపోతుంది. ఈ మూవీకి బలం కూడా సెకండాఫే. ఫస్ట్‌హాఫ్‌లో తలెత్తిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ అనూహ్యమైన మలుపులతో ఆసక్తిగా సినిమాను నడిపించాడు దర్శకుడు. కథలో ఒక్కసారిగా వచ్చే మలుపు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మిడిల్‌క్లాస్ వారి అవసరాలను ఆసరాగా తీసుకొని కొంతమంది చేసే మోసాలను దర్శకుడు కళ్ళకు కట్టాడు. అయితే.. ఈ కథకు ఇంకాస్త ఎమోషన్ అవసరం. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, కథకు కావాల్సిన ఎమోషన్స్‌ని దర్శకుడు పక్కన పెట్టాడనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్రధమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మాత్రం బావుందనే చెప్పాలి.
నటీనటులు
పాత్ర ఏదైనా సరే.. విశ్వక్ సేన్ ఫుల్ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. ఈ సినిమాలోనూ అంతే. మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ అద్భుతంగా నటించారు. ఇక, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరికీ ఇందులో బలమైన పాత్రలు దక్కాయి. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సునీల్, నరేష్, హర్షవర్ధన్, రోడీస్ రఘు, హర్ష చెముడు తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతిక వర్గం
నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి మంచి కథే రాసుకున్నాడు. కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. కథపై, కథనంపై, ఎమోషన్స్‌పై ఇంకాస్త శ్రద్ధ పెడితే సినిమా వేరె లెవల్లో ఉండేది. జేక్స్ బిజోయ్ సాంగ్స్ ఆకట్టుకోవు. అలాగే బీజీఎం కూడా. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కొన్ని చోట్ల సీన్‌కి సీన్‌కి మధ్యలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- విశ్వక్ సేన్ నటన
- విశ్వక్ – మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ
- ట్విస్టులు, సెకండాఫ్
మైనస్ పాయింట్స్
- ఎడిటింగ్
- సాంగ్స్, బీజీఎం
పంచ్ లైన్: మెకానిక్ రాకీ.. కొంచెం రిపేర్ చేసుంటేనా.. వేరె లెవల్!