Amaran: ఫోన్ నంబర్ తెచ్చిన తంటా.. ‘అమరన్’ టీమ్‌ను రూ. కోటి పరిహారం కోరిన విద్యార్థి
తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘అమరన్’. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. అయితే ఈ సినిమా వల్ల తనకు ఇబ్బంది కలిగిందని, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని విఘ్నేశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మూవీ టీమ్‌కి ఏకంగా రూ. 1.1 కోటి నష్టపరిహారంగా ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ఫోన్ నంబర్ నాదే!
ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో హీరోయిన్ సాయిపల్లవి.. హీరోకు తన ఫోన్ నంబర్ ఇస్తుంది. దీని కోసం చిత్రబృందం ఒక నంబర్ ఉపయోగించింది. సినిమా విడుదలయ్యాక.. సాయిపల్లవి ఫోన్ నంబర్ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో చూపించిన నంబర్ తనేదనని.. వరుస ఫోన్ కాల్స్, సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్ పేర్కొన్నాడు. దీనివల్ల తాను కుటుంబ సభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని చెప్పాడు. తన ఫోన్ నంబర్ ఉపయోగించినందుకు చిత్రబృందం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరాడు.