
Saif Alikhan: ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగుడు ఆయనను కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. దుండగుడి దాడిలో సైఫ్ అలీఖాన్‌కు మొత్తం 6 చోట్ల కత్తిపోట్లు దిగాయి. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే అర్ధరాత్రి రక్తపు మరకలతో ఉన్న సైఫ్‌ను ఆసుపత్రిలో చేర్చింది ఎవరో కాదు, ఆ రూట్‌లో వెళ్తున్న ఆటో డ్రైవర్ భజన్ సింగ్. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో భజన్ సింగ్ ఆటో ఆపి సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి చేర్చారు. నిన్న సైఫ్ అలీఖాన్ గాయాల నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు
అయితే డిశ్చార్జ్ అనంతరం సైఫ్.. ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు అతడిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. క్లిష్ట సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటో తాజాగా బయటకు వచ్చింది. మరోవైపు, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సైతం డ్రైవర్ సాయాన్ని మెచ్చుకున్నారు. సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ పై సోషల్ మీడియాలో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.