
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి బాలీవుడ్‌లో కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత లోతుగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే ఘటనపై సైఫ్ భార్య కరీనా చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరకపోవడంతో పోలీసులు కరీనా పాత్రపైనా అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్‌పై దాడి జరిగిందని కరీనా చెప్పారు. దుండగుడిని గదిలో బంధించామని, తర్వాత అతడు తప్పించుకుపోయాడని పోలీసులకు చెప్పారు. అయితే, పోలీసులు సీన్ రీ క్రియేట్ చేయగా.. ఘటన తీరుకు, కరీనా చెప్పిన సమాచారానికి పొంతన లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు కరీనాను, పనిమనిషిని వేర్వేరుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
అపార్టుమెంట్‌లోకి ఎలా చొరబడ్డాడు?
కాగా.. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు సైఫ్‌పై ఆరో చోట్ల కత్తితో దాడి చేసి పారిపోయాడు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి వైద్యులు సైఫ్‌కి రెండు సర్జరీలు చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటారున్నారు. మరోవైపు దాడికి పాల్పడిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బంగ్లాదేశ్ జాతీయుడిగా గుర్తించారు. ఇతను అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడిని లోతుగా విచారిస్తున్నారు. అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన సైఫ్ అపార్టుమెంట్‌లోకి దుండుగుడు ఎలా చొరబడ్డాడన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు.