
Saif: సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు.. నిందితుడు బంగ్లాదేశీయుడిగా గుర్తింపు!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన దుండగుడిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితుడి గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. దుండగుడు అక్రమంగా మన దేశంలో చొరబడ్డాడని వివరించారు. ‘సైఫ్ అలీఖాన్ కేసులో అరెస్టయిన నిందితుడు బంగ్లాదేశీయుడు. అతడి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్. అతని వయస్సు 30 సంవత్సరాలు. అతను భారతీయుడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నాడు. కొన్ని నెలల క్రితమే ముంబైకి వచ్చిన అతడు ఆ తర్వాత కొద్దిరోజులు ముంబై నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు 15 రోజుల క్రితమే ముంబై తిరిగి వచ్చిన అతడు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసేందుకు చేరాడు.’ అని తెలిపారు.
ఎందుకు వచ్చాడు?
అయితే, దొంగతనం చేయడానికే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. ఆ సమయంలో అడ్డు వచ్చిన సైఫ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఎందుకు దాడి చేశాడు? పైగా కత్తితో అన్ని పోట్లు ఎందుకు పొడిచాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే సైఫ్ ఇంట్లోకి దుండగుడు ఎలా ప్రవేశించాడు? ఎందుకు వచ్చాడు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. శస్త్రచికిత్స అనంతరం సైఫ్ కోలుకుంటున్నారు.