Nayanthara vs Dhanush: నయనతారకు హీరో ధనుష్ రూ. 10 కోట్ల లీగల్ నోటీసులు.. అసలు ఏం జరిగిందంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇంత దిగజారుతావ్ అనుకోలేదు’ అంటూ విమర్శించారు. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు దాదాపు మూడు పేజీలున్న నోట్‌ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు
అసలేం జరిగింది?
నయనతార ‘నేనే రౌడీనే’ సినిమా చేశారు. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మించారు. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్‌లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. నయనతార పెళ్లి, జీవిత విశేషాలతో ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 18న డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ‘నేనే రౌడీనే’ మూవీ షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యారు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎంతకీ రాజీ కుదరకపోవడంతో ఇక నయన్ ఓపెన్ అయ్యారు. ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టారు.
ఎందుకు అంత పగ?
‘తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడి స్థానంలో ఉన్నాను. నేను కనిపించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో ‘నేనే రౌడీనే’) సినిమా క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. ఈ మూవీలో పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. ‘నానుమ్ రౌడీ దానే’ షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్‌తో తీసుకున్న వీడియోని ట్రైలర్‌లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం.’ అని రాసుకొచ్చారు.