Oscar – 2025: ఆస్కార్ బరిలో కంగువా..! ఎలా సాధ్యం?
సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికి కల ‘ఆస్కార్’. సినిమాల్లో పనిచేసే ప్రతి టెక్నీషియన్ తమ ప్రతిభకు గుర్తింపుగా, కొలమానంగా ‘ఆస్కార్’ అవార్డునే భావిస్తారు. ఇక, ఆస్కార్ బరిలో నిలవాలంటే మాటలు కాదు, ఆ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరించాలి. సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అయితే, ఆస్కార్ 2025 బరిలో నిలిచే సినిమాల లిస్ట్ బయటికొచ్చింది. అందులో సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఉండడంతో ప్రేక్షకులంతా షాకవుతున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అలాంటిది ఆస్కార్ జ్యూరీని మాత్రం ఎలా ఇంప్రెస్ చేసింది? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
ఉత్తమ చిత్రం కేటగిరీలో నిలిచిన సినిమాలు..
కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (హిందీ), సంతోష్ (హిందీ), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ (మలయాళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లిష్) చిత్రాలు భారత్ నుంచి ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే, మిగితా చిత్రాల విషయం అటుంచి.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సూర్య నటించిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ‘కంగువా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ విషయం తెలిసిందే. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ తీరా రిలీజయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శివ.. తాను కన్ఫ్యూజ్ అయ్యి ప్రేక్షకులను కూడా కన్ఫ్యూజ్ చేశారు. దీంతో ఈ మూవీ స్టోరీ లైన్ ఆడియన్స్‌కి ఏమాత్రం ఎక్కలేదు.