Allu Arjun: రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్.. విడుదల ఆలస్యంపై తీవ్ర అనుమానాలు?
![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/12/allu-arjun-3-3-1-1024x576.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. అరెస్టుకు ముందు, ఆ తర్వాతి పరిణామాలు, హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసినా జైలు అధికారులు ఆయనను విడుదల చేయకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదని, అల్లు అర్జున్ తరఫు లాయర్లు తెచ్చిన కాపీలో పలు లోపాలున్నాయని జైలు అధికారులు చెప్పడం పట్ల తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిని బట్టి అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కచ్చితంగా కుట్ర కోణం ఉందని రాజకీయ, సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రాత్రంతా నేలపైనే!
బెయిల్ పత్రాల లోపాలను సరిచేసే వరకు ఆయన చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. జైలులో క్లాస్-1 బ్యారక్‌లో ఆయన గడిపారు. పోలీసులు అల్లు అర్జున్‌కు పడుకోవడానికి కొత్త దుప్పటి ఇచ్చినా పడుకోలేదు. రాత్రంతా నేలపై కూర్చునే ఉన్నారు. ఈ పరిణామాలపై అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు, ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ బెడ్ రూంలోకి పోలీసులు దూసుకెళ్లి, ఒక నేరస్తుడి లాగా ఆయనను అరెస్ట్ చేయడం, ఒక జాతీయ అవార్డు గ్రహీత పట్ల తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, అల్లు అర్జున్ అరెస్టును టాలీవుడ్ మొత్తం ఖండిస్తోంది. తెల్లవారుజామున విడుదలై ఇంటికి చేరుకున్న ఆయనను పరామర్శించేందుకు సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ విడుదల ఆలస్యం విషయంలో న్యాయపరమైన చర్యలకు దిగుతామని ఆయన తరుఫు న్యాయవాది తెలిపారు.