Allu Arjun: పవన్ అపాయింట్‌మెంట్ కోసం బన్నీ వెయిటింగ్?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు చేశారా? లేదా ఆయనను కావాలనే అరెస్ట్ చేశారా? అన్న విషయం పక్కనపెడితే ఈ అరెస్టుతో మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య గత ఆరు నెలలుగా ఉన్న గ్యాప్ మాత్రం ఫిల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ సైతం చల్లారిపోయింది. అల్లు అర్జున్ పగోడు కాదు, మనోడే అంటున్నారు మెగా ఫ్యాన్స్.. ఇక మెగా ఫ్యామిలీ మన ఫ్యామిలీనే అంటున్నారు అల్లు ఆర్మీ! అరెస్టు సందర్భంగా తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబులను అల్లు అర్జున్ కలవడంతో ఇక, ఈ వార్‌కి ఎండ్ కార్డ్ పడినట్లుగానే అందరూ భావిస్తున్నారు.
త్రివిక్రమ్‌తో ప్రయత్నాలు!
ఇక, ఇదే ఊపులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా మరో అడుగు కూడా ముందుకేసినట్లు తెలుస్తోంది. తన చిన్న మామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు తనకు, అటు పవన్‌కు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ కార్యక్రమాల్లో పవన్ బిజీగా ఉండటంతో ఆయన అపాయింట్‌మెంట్ కోసం బన్నీ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. బన్నీ కోసమే పవన్ హైదరాబాద్ వచ్చారన్న వార్తలు కూడా వినిపించాయి. ఏమైందో తెలీదు కానీ ఆ మర్నాడే, అల్లు అర్జున్‌ను కలవకుండానే పవన్ మళ్లీ ఏపీకి వెళ్లిపోయారు. దీనిపై రకరకాల వార్తలు వినిపించినా.. ఫైనల్‌గా అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకేసి పవన్ కలవనుండటం పట్ల ఇటు మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారట.