Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి షాక్.. సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైలుకే!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై పోలీసులు నిఘా పెంచారు. బన్నీ అరెస్టు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించి కాంగ్రెస్ నేతలు సహా పలువురి ఫిర్యాదు మేరకు వారిపై కేసులు పెడుతున్నారు. నిందితులపై ఐటీ యాక్ట్‌తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పోలీసులు చర్యలకు ఉపక్రమించడంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆగమేఘాల మీద తాము చేసిన సోషల్ మీడియా పోస్టులను తొలగించే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ప్రశ్నిస్తే కేసులా?
కాగా.. డిసెంబర్ 4న ‘పుష్ప-2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, ఫ్యాన్స్‌పై కేసులు పెట్టడాన్ని పలువురు అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించేవారి గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.