Allu Arjun with Megastar: మెగాస్టార్‌ను కలిసిన అల్లు అర్జున్.. ఫ్యామిలీ వార్‌కి ఇక ఫుల్ స్టాప్!
అల్లు – మెగా ఫ్యామిలీ వార్ ఎట్టకేలకు ముగిసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల తదుపరి పరిణామాలు రెండు కుటుంబాలను మళ్లీ ఒక్కటి చేశాయి. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన పెద్దరికం నిలబెట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇరు కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అయినా ఆపత్కాలంలో మాత్రం తామంతా ఒక్కటేననే సందేశాన్ని మెగాస్టార్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే చిరంజీవి తన షూటింగ్‌ని క్యాన్సిల్ చేసుకొని మరి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వద్దని చెప్పడంతో తన సతీమణితో బన్నీ ఇంటికి వెళ్లారు. అల్లు అరవింద్‌ని, కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పారు.
పవన్ ఎందుకు వెళ్లిపోయారు?
ఇ, ఆ మరునాడు మెగాస్టార్ సతీమణి సురేఖ మరోసారి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డాం. ఆయన (చిరంజీవి) కూడా నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారు’ అని సురేఖ చెప్పారు. అయితే తాజాగా మావయ్య మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడే మధ్యాహ్నం లంచ్ చేశారు. ఈ సందర్భంగా అరెస్ట్, తదుపరి పరిణామాల చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో ఇద్దరు కలిసి చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు, అల్లు అర్జున్ విడుదలైన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం బన్నీని కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తిరిగి ప్రత్యేక విమానంలో మళ్లీ ఏపీకి వెళ్లిపోయారు.