Allu-Mega Family War: నీ సక్సెస్ దేనికీ పనికి రాదు..! అల్లు అర్జున్‌కి వరుణ్ తేజ్ స్ట్రాంగ్ కౌంటర్?
అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య ‘ఏపీ ఎన్నికలు’ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇరు కుటుంబాల మధ్య వైరం మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తూ రోజురోజుకి స్ట్రాంగ్ అవుతోంది. ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంతో ఈ వివాదం షురూ అయ్యింది. ఒకవైపు మెగా కుటుంబం నుంచి కూటమి తరఫున వైసీపీపై పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తుండగా.. అదే వైసీపీ అభ్యర్థికి బన్నీ ప్రచారం చేయడం కొందరు మెగా అభిమానులకు మింగుడు పడలేదు. దాంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై తెగ ట్రోల్స్ చేశారు. ఇక, ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఆ ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నాకు నచ్చితేనే వస్తా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇరు కుటుంబాల మధ్య వివాదానికి కారణమయ్యాయి. దీంతో మెగా ఫ్యాన్స్ మరోసారి అల్లు అర్జున్‌పై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. నాగబాబు మొదలుపెట్టిన ఈ వార్.. ఇప్పటికీ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో మెగా హీరోలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ పోటాపోటీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక, తాజాగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఈ ఇష్యూలో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
వరుణ్ తేజ్ హాట్ కామెంట్స్!
నిన్న జరిగిన ‘మట్కా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో.. నీ వెనుక సపోర్ట్ ఉన్నది ఎవరో? అనే విషయాన్ని మర్చిపోతే నీ సక్సెస్ దేనికీ పనికిరాదు’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కళ్యాణ్), అన్నయ్య (రామ్ చరణ్)లను ప్రతీ వేదికపై గుర్తు చేసుకుంటూనే ఉంటానని, ఎవరు ఎన్ని అనుకొన్నా, ఇంట్లో వాళ్ల పేర్లు ఎక్కువగా చెబుతావేంటి? అని అడిగినా తాను పద్ధతి మార్చుకోనని, వాళ్ల వల్లే వృద్దిలోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. అయితే వరుణ్ తేజ్ స్పీచ్ అల్లు అర్జున్ హేటర్స్‌కు బాగా కిక్ ఇచ్చింది.
ఈ వార్ ఎంత దాకా?
ఆ వ్యాఖ్యలు హీరో అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవేనని, పదే పదే తమ ఫ్యామిలీతో పెట్టుకుంటున్న అల్లు అర్జున్‌కి వరుణ్ తేజ్ ‘మట్కా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని ఇండస్ట్రీలో గట్టిగా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎదగకముందు.. అంటే తన కెరీర్ కొత్తలో చాలా సందర్భాల్లో ఆయనకు సినిమా జీవితాన్ని ప్రసాదించింది కేవలం చిరంజీవి మాత్రమేనని, ఆయన వల్లే తాను హీరోనయ్యానంటూ చెప్పారు. మెగాస్టార్ వేసిన రోడ్ మీదే తామంతా నడుస్తున్నట్లు చెప్పొకొచ్చారు. కానీ ఉన్నట్టుండి ఆయన బిహేవియర్‌లో మార్పు వచ్చింది. ఎందుకో తెలీదు కానీ మెల్లమెల్లగా మెగా ట్యాగ్‌కి దూరంగా జరుగుతూ వస్తున్నారు. తనను తాను ఒక ‘సెల్ఫ్ మేడ్ హీరో’గా ఇండస్ట్రీలో ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ని కాస్త తన వరకు ‘అల్లు అర్జున్ ఆర్మీ’గా మార్చేసుకున్నారు. మరి రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఈ కోల్డ్ వార్ ఎంత దాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే.