Amitabh: అల్లు అర్జున్‌తో నన్ను పోల్చొద్దు.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానిని అంటూ బిగ్ బీ పేర్కొన్నారు. అయితే, తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లోనూ బన్నీపై ప్రశంసలు కురిపించారు.
పుష్ప-2 చూడకపోతే వెంటనే చూడండి!
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రస్తుతం 16వ సీజన్ ప్రసారమవుతోంది. దీని తాజా ఎపిసోడ్‌కు కోల్‌కతాకు చెందిన ఓ గృహణి కంటెస్టెంట్‌గా వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. ‘అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులన్నిటికీ పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల బన్నీ నటించిన ‘పుష్ప: ది రూల్’ విడుదలై మంచి విజయం సాధించింది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అతడితో నన్ను పోల్చొద్దు’ అంటూ సరదాగా చెప్పారు. దీనికి ఆ కంటెస్టెంట్ స్పందిస్తూ.. ‘కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదోఒకరోజు అల్లు అర్జున్‌ను చూస్తే నా కల నెరవేరుతుంది’ అని అన్నారు.