Bigg Boss-8: బిగ్‌బాస్ విజేత నిఖిల్.. ప్రైజ్ మనీ, పారితోషికంతో పాటు ఏమేం అందుకున్నాడంటే..?
దాదాపు 105 రోజుల పాటు టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 ముగిసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో నిన్నటితో ముగిసింది. నిన్న గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఈ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లందరూ పాల్గొని సందడి చేశారు. ఇక, ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సీజన్-8 విజేతగా అందరూ ఊహించినట్టుగానే సీరియల్ నటుడు నిఖిల్ నిలిచారు. రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ. 55 లక్షల చెక్కు అందుకున్నారు.
మొత్తం 88 లక్షలు
అయితే విజేత నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ పొందిన విజేతగా నిలిచారు. గత సీజన్లలో బిస్ బాస్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు కాగా.. ఈసారి దానిని రూ. 55 లక్షలకు పెంచారు. టైటిల్ విజేతగా నిలిచినందుకు రూ. 55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్న నిఖిల్ మారుతి డిజైర్ కారు కూడా దక్కించుకున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నిఖిల్ వారానికి ఏకంగా రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నారట! ఈ లెక్కన మొత్తం పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు నిఖిల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.