
Brahmanandam: అందుకే సినిమాలు తగ్గించాను..! బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!
కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన ‘బ్రహ్మా ఆనందం’ మూవీ టీజర్ విడుదలైంది. నిజజీవితంలో తండ్రీకొడుకులైన వీరు ఈ మూవీలో తాత, మనవళ్లుగా అలరించబోతున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
వేషాలు లేకనో, అవకాశాలు రాకనో కాదు!
మూవీ టీజర్ రిలీజ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . సినిమాలు తగ్గించడంపై ఆయన స్పందించారు. ఎందుకు ఎక్కువ సెలక్టివ్ అయ్యారు అని విలేకరులు అడిగితే.. చేసిన కామెడీనే చేస్తున్నానని అంటున్నారని అందుకే సినిమాలు తగ్గించానని అన్నారు. అంతేకాని, వేషాలు లేకనో, అవకాశాలు రాకనో కాదని స్పష్టంచేశారు. ‘అలాగే మరొకటి వయసు. మన వయసును దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకు ముందు చేసినంత యాక్టివ్‌గా నేను చేయలేకపోతున్నా అనే విషయం కూడా నాకు తెలుసు. మనల్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవడం తగ్గించేశాను.’ అని అన్నారు.