తెలుగు
te తెలుగు en English
Linkin Bioటాలీవుడ్

CM Revanth: నాగార్జున నుంచి బన్నీ దాకా.. సినిమా స్టార్ల పాలిట సీఎం రేవంత్ విలన్‌‌గా మారారా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తే ఆయనకు ఎక్కడో సినిమా వాళ్లపై కించిత్తు కోపం ఉన్నట్లుగా అర్థమవుతోంది. సినిమా వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘హైడ్రా’ను తీసుకొచ్చిన కొత్తలో తన వద్ద అన్ని అనుమతులు ఉన్నాయన్నా, కోర్టు స్టే ఉన్నా అక్రమ కట్టడాల విషయంలో తగ్గేదేలే అంటూ నాగార్జున ‘ఎన్’ కన్వెన్షన్‌ను కూల్చిన రేవంత్ రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనలో చివరకు అల్లు అర్జున్‌కు ఏకంగా జైలు జీవితాన్ని రుచి చూపించేశారు. అంతేకాదు, సమంత – నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ తెలంగాణ సమాజమే తలదించుకొనేలా మాట్లాడినా ఆమె వ్యాఖ్యల్ని సీఎం కనీసం ఖండించలేదు.

ఒక్కడినే బాధ్యుడిని చేయడం..!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో తప్పు ప్రభుత్వానిదా? పోలీసులదా? లేదా అల్లు అర్జున్‌దా? అన్నది కాసేపు పక్కన పెడితే.. ఈ విషయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ చూపిస్తున్న ‘అత్యుత్సాహం’ విమర్శలకు కూడా తావిస్తోంది. తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్‌పై ఇటు ప్రభుత్వం గానీ, అటు పోలీసులు గానీ తీసుకుంటున్న చర్యల్ని సమర్థించే వారు ఉన్నట్టే.. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని కేవలం అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారన్నది నిజం.

వ్యక్తిగత విమర్శలు, భౌతిక దాడులు

అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం, ఆయనకు కాలు పోయిందా? కన్ను పోయిందా? అంటూ మాట్లాడం, పనిలో పనిగా సినిమా స్టార్లందర్నీ ఏకరువు పెట్టేయడం, తాను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు, టిక్కెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రెచ్చిపోగానే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయారు. ఇక, కాంగ్రెస్ పార్టీ దోస్తీ కోసం పాకులాడుతున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఏకంగా మరో అడుగు ముందుకేసి.. సీఎం మెప్పు కోసం థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌పై వ్యక్తిత్వ హననం చేయడమూ చూశాం, ఇక, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే ఏకంగా పుష్ప- 2 సినిమా చూసి టైం వేస్ట్ అయ్యిందని, సినిమా రిలీజైన 15 రోజులుకు చెప్పడం, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితే జీర్ణించుకోలేని కొంతమంది ‘హస్తం’ పార్టీ యువ నాయకులు ఓయూ జేఏసీ పేరుతో ఆయన ఇంటిపై దాడి చేయడం.. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అల్లు అర్జున్ నేషనల్ అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేయడం.. ఇవన్నీ ప్రహసనాన్ని తలిపిస్తున్నాయి.

వ్యతిరేకతకు దారి తీస్తుందా?

‘హైడ్రా’ విషయంలో ఎన్-కన్వెషన్‌తో మొదలైన సీఎం రేవంత్ హీరోయిజం ఎలాగైతే సామాన్యుల మీదకు వెళ్లాక విలనిజంగా మారిందో, ఇప్పుడు అసెంబ్లీ స్పీచుతో మొదలైన హీరోయిజం, సస్పెండైన పోలీసు ప్రెస్ మీట్‌తోనూ.. ఓయూ జేఏసీ దాడితోనూ విలనిజానికి దారి తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా వాళ్లలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపైన, ఆ పార్టీపై కొంత వ్యతిరేకత కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వాధినేతకు సంయమనం చాలా అవసరం. ఎదుటివాడు రెచ్చగొట్టినా రియాక్టవకుండా సమయం కోసం వేచి చూడాలి. అదే రాజనీతి అంటే మరి..! కానీ సినిమా వాళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ఆయనకు ఆయనే రెచ్చిపోతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button