Devara: అదంతా అబద్ధపు ప్రచారం.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై స్పందించిన ఆర్గనైజర్లు!
హైదరాబాద్‌లో నిన్న జరగాల్సిన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైన విషయం తెలిసిందే. అయితే దీనిపై నిర్వాహకులైన శ్రేష్ట్ మీడియా తాజాగా స్పందించింది. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ సంస్థ నిర్వాహకులు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఈ ఈవెంట్ కోసం వాళ్లు చేసిన ఏర్పాట్ల వివరాలను తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘ఎన్టీఆర్‌పై మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా తెరపై కనపడుతుండడంతో మీరంతా మరింత ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన పరిణామంతో మీరంతా నిరుత్సాహానికి గురయ్యారని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం. అని పేర్కొన్నారు.
అదంతా అబద్ధం!
అంతేకాదు, పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధని తెలిపారు. ‘మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 30, 35 వేల మంది అభిమానులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో గేట్లు కిక్కిరిసిపోయాయి. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తడంతో మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అభిమానుల భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం.’ అని వివరించారు.