
Dil Raju: ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో గత ఐదు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అధికారుల సోదాలు ముగిసిన నేపథ్యంలో దిల్ రాజు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. తనపై జరిగిన ఐటీ దాడులపై సోషల్ మీడియాలో ఏవేవో అబద్ధాలు ప్రచారం చేశారని అన్నారు. ఇంత డబ్బు దొరికింది.. ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయంటూ ఫేక్ వార్తలు పబ్లిష్ చేశారని చెప్పారు. ఫేక్ కలెక్షన్స్ వల్లే ఐటీ సోదాలు జరుగుతున్నాయని వస్తోన్న వార్తలపై స్పందించారు.
వ్యాపార రంగంలో ఐటీ దాడులు సహజం!
‘2008లో ఒకసారి ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారు. వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు సాధారణం. మా వద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బును అధికారులు గుర్తించలేదు. నా వద్ద రూ.5 లక్షలు, శిరీష్ వద్ద రూ.నాలుగున్నర లక్షలు, మా కుమార్తె వద్ద రూ.ఆరున్నర లక్షలు, ఆఫీస్‌లో రూ.రెండున్నర లక్షలు.. ఇలా మొత్తం సుమారు రూ.20 లక్షల కంటే తక్కువే డబ్బు ఉంది. అది కూడా అనధికార డబ్బు కాదు. దానికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. లిమిట్స్ ప్రకారమే బంగారం కూడా ఉంది. 24 క్రాఫ్టుల్లో లావాదేవీలు ఎలా జరిగాయనేది చెప్పాం. డిపార్ట్‌మెంట్ కూడా ఆశ్చర్యపోయింది. ఈ దాడులకు మేము పూర్తిగా సహకరించాం. అందరి అకౌంట్ విషయాలు క్లీన్‌గా ఉన్నాయి.’ అని వెల్లడించారు.