
Diwali Box Office: దీపావళి ధమాకా.. బరిలో ఏడు సినిమాలు!
దసరా అయిపోయింది.. దీపావళి సందడి మొదలైపోయింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలు చిన్న, పెద్ద, డబ్బింగ్ సినిమాలు సిద్ధమైపోయాయి. వాటిలో లక్కీ భాస్కర్ కూడా ఒకటి. ధనుష్‌తో ‘సర్’ మూవీ చేసి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, ఆయేషా ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇక, తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న శివకార్తికేయ కూడా ఈ దీపావళికి ‘అమరన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ మూవీ, అక్టోబర్ 31న విడుదల అవుతోంది.
డబ్బింగ్ చిత్రాల హవా..
చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈసారి దీపావళికి సందడి చేయనున్నారు. ‘క’ మూవీతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో అంచనాలు పెంచేసిన ‘క’ మూవీని, కిరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది కూడా దీపావళి కానుకగా అక్టోబర్ 31నే థియేటర్లలోకి రాబోతోంది. ఇక ‘కృష్ణమ్మ’ తర్వాత సత్యదేవ్ నటిస్తున్న సినిమా ‘జీబ్రా’. కన్నడ నటుడు ధనంజయ మరో హీరోగా నటిస్తున్న ‘జీబ్రా’ మూవీకి ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాని కూడా అక్టోబర్ 31న దీపావళి కానుకగా థియేటర్లలోకి తేబోతున్నారు. ‘ఉగ్రం’ ఫేమ్, కన్నడ స్టార్ శ్రీమురళీ హీరోగా నటిస్తున్న సినిమా ‘భగీరా’. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ కథను అందిస్తుండడంతో ‘భగీరా’ మూవీపై కన్నడలో భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ డబ్ అవుతోంది.తమిళ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక వరుస హిట్లతో జోరు మీదున్న కెవిన్ రాజ్ చేస్తున్న మూవీ ‘బ్లడీ బెగ్గర్’. కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నా, అడుక్కోవడానికి నాటకాలు ఆడే ముష్టివాడి పాత్రలో కెవిన్ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ కూడా దీపావళికే విడుదల అవుతోంది. జయం రవికి తెలుగులో పెద్దగా ఫాలోయింగ్ లేదు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రదర్’ కూడా దీపావళికే విడుదల అవుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ‘బ్రదర్’ మూవీని అక్టోబర్ 31న తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.