Game Changer: ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టిక్కెట్ రేట్స్ పెంపునకు అనుమతి!
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్‌కి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో టిక్కెట్ రేట్స్ పెంపుతో సహా, ప్రత్యేక షోలకూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ (జనవరి 10న రాత్రి 1 గంటలకు) షోకి ఒక్కో టిక్కెట్ ధరపై అదనంగా రూ. 600 పెంచింది. రెగ్యులర్ షోలకు ప్రస్తుతం ఉన్న ఒక్కో టిక్కెట్ ధరపై మల్టీఫ్లెక్స్‌లో అయితే అదనంగా రూ.175 పెంచగా.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అయితే అదనంగా రూ.135 పెంచింది. ఇక మొదటి రోజు 6 షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా.. ఈ నెల 11 నుంచి 23 వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీ టిక్కెట్ రేట్స్ పెంపునకు, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
అంచనాలు పెంచేసిన ట్రైలర్!
శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. కియారా అడ్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. తమిళ్ యాక్టర్ ఎస్.జె. సూర్య విలన్‌గా నటించారు. శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా? అని మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు మూవీపై అంచనాలు పెంచాయి.