Game Changer: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న పెద్ద సినిమా.. చరణ్‌కు కలిసొస్చేనా?
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. దేశవ్యాప్తంగా అతి పెద్ద పండుగ కావడంతో ఆ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయాలని మేకర్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పలు బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. వాటిలో శంకర్-రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలున్నాయి.
తమిళ్‌లో పెద్ద సినిమా లేనట్లే!
ఇక తమిళంలో స్టార్ హీరో అజిత్ ‘విదాముయార్చి’ విడుదల కావాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా అజిత్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అర్జున్, రెజీనా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో రానున్న ఒకే ఒక పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రం వాయిదా పడడంతో ఈ పండుగకు అక్కడ పెద్ద సినిమా లేనట్లే. అయితే.. ఇది గేమ్‌ఛేంజర్ మూవీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. గేమ్ ఛేంజర్ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రను పోషించడంతో ఈ చిత్రానికి అక్కడ మంచి బజ్ నెలకొంది.