
Thrinatha Rao: హీరోయిన్‌పై ఘాటు వ్యాఖ్యలు.. చిక్కుల్లో పడ్డ టాలీవుడ్ డైరెక్టర్..!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు చిక్కుల్లో పడ్డారు. నిన్న జరిగిన ‘మజాకా’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అన్షు మీద ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సీరియస్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించినట్లు ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద వెల్లడించారు. ఆయనకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్. రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నిన్న టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. అయితే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ ‘అన్షు ఫారెన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని, అలా కాదని, తెలుగుకు సరిపోదు, కొంచెం అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా, పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ‘సెకండ్ హీరోయిన్ పేరు..’ మర్చిపోయినట్టుగా తాగడానికి నీళ్లు అడగడం సైతం చర్చనీయాంశమైంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడాన్ని ఇమిటేట్ చేయడమేనని విమర్శలు వస్తున్నాయి.