
IT Rides: టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న ఐటీ రైడ్స్!
ఇన్‌కం ట్యాక్స్ అధికారుల సోదాలు టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బంధువులు, వ్యాపార భాగస్వాములు ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే పుష్ప-2 నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో, మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు రంగంలోకి దిగి ఏక కాలంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా మొత్తం 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
దిల్ రాజు @ మూడు సినిమాలు
కాగా.. సంక్రాంతి కానుకగా రిలీజైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అలాగే బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాకు సైతం ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు స్వయంగా దిల్ రాజు చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు సినిమాలకు సంబంధించిన లావాదేవీలపై ఐటీ అధికారులు దిల్ రాజును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.