Johnny Master: జైలు నుంచి విడుదల.. ఇకపై జానీ మాస్టర్ పరిస్థితేంటి?
అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్టై గత 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో గడిపిన జానీ మాస్టర్ ఎట్టకేలకు ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చారు. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో.. అది కూడా నేషనల్ అవార్డుకు ఎంపికై, తీరా దాన్ని అందుకోబోతున్న పరిస్థితుల్లో అందినట్టే అంది అది చేజారిపోయింది. జీవితంలో ఎవ్వరూ కోరుకోని ఈ స్టేజ్‌ను చవిచూశారు జానీ మాస్టర్. ఈ దశ ఎవరికైనా ఇబ్బందికరమే. గడిచిన కొన్ని రోజులుగా జానీ మాస్టర్ పై పుంఖానుపంఖాలుగా వార్తలు, కథనాలు, చర్చావేదికలు నడిచాయి. కొన్ని ఆడియో టేపులు, ఇంకొన్ని వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఈ వ్యవహారాన్ని ఎంతలా వాడుకోవాలో అంతలా సోషల్ మీడియా వాడేసుకుంది.
అవకాశాలు వస్తాయా?
ఇక, జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. మరి ఇప్పుడు మాస్టర్‌కు అవకాశాలు వస్తాయా? ఆయన మరోసారి స్టార్ హీరోల సినిమాలకు పని చేయగలరా? టీవీ కార్యక్రమాల్లో కనిపించగలరా? అని రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వచ్చినట్టు ఈసారి ఆయనకు వరుసగా అవకాశాలు వస్తాయని మాత్రం చెప్పలేం. అలా అని రావని కూడా చెప్పలేం. పోలీస్ కేసులు, కోర్టు కేసులు చవిచూసిన చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు కెరీర్‌లో వెనకబడిన దాఖలాలున్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని ఇండస్ట్రీలో కొంతమంది ప్రోత్సహించరు, ఇక మరికొంతమంది మాత్రం కేవలం టాలెంట్ ప్రాతిపదికగా అవకాశాలిస్తారు కాబట్టి ఆ కోవలో జానీ మాస్టర్‌కు అవకాశాలు రావొచ్చు.
పెద్ద హీరోలు మళ్లీ ఛాన్స్ ఇస్తారా?
మరి పెద్ద హీరోల సంగతేంటి? ఇప్పటికే ఓ స్టార్ హీరో జానీ మాస్టర్ తమ ప్రాజెక్టులో పనిచేసేందుకు వీల్లేదని చెప్పేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక మరికొందరేమో.. జానీ మాస్టర్‌ను తమ సినిమాలోకి తీసుకుంటే ఎవరైనా ఏమైనా అంటారేమో.. ఓ సెక్షన్ విమర్శలకు దిగుతుందేమో.. మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయేమో.. ఇలా ఎన్నో అనుమానాలు, భయాలుంటాయి. కోరి వివాదాలు తెచ్చుకోవడం ఎందుకు, సినిమాను ఇబ్బందుల్లో పెట్టుకోవడం ఎందుకని కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ అంటే ఇష్టపడే హీరోలు, ఆయన టాలెంట్‌ను ప్రోత్సహించే హీరోలు టాలీవుడ్‌లో కొంతమంది ఉన్నారు. ఎవరేమనుకున్నా వాళ్లు తిరిగి తమ సినిమాల్లో ఛాన్సులివ్వడం గ్యారెంటీ.
రాజకీయ భవిష్యత్తు మాటేంటి?
ఇక రాజకీయంగానూ జానీ మాస్టర్ కెరీర్ కొంతవరకు ప్రశ్నార్థకమనే చెప్పాలి. మొన్నటి దాకా జనసేన పార్టీలో చాలా చురుగ్గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయనపై ఆ పార్టీ సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి కనిపించడం లేదు. కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆయనకు పార్టీలో తిరిగి చోటు కల్పించకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.