Manchu Family War: ‘మంచు’ కుటుంబంలో ‘మంట’.. కారణం అదేనా?
![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/12/Manchu-Family-Dispute-1-1024x576-2.jpg)
మంచు మోహన్ బాబు.. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. దాసరి నారాయణ రావు తర్వాత టాలీవుడ్‌కి పెద్ద దిక్కు ఎవరంటే మోహన్ బాబు పేరే వినిపిస్తుంది. అందుకు తగ్గట్టే ఆయన కుటుంబం డిసిప్లిన్‌కు మారుపేరు. తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మోహన్ బాబు మాటను జవదాటరని పేరు కూడా ఉంది. కానీ ఉన్నట్టుండి ఆ కుటుంబ పరువు, మర్యాద ఒక్కసారిగా మీడియాలోకి ఎక్కేశాయి. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి పరస్పర ఫిర్యాదులతో రచ్చ రచ్చ జరిగింది. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది? ఈ వివాదానికి కారణం ఏంటి? ఇది ఆస్తుల గొడవా? అస్తిత్వ గొడవా?
ఇల్లు కోసమా?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వివాదానికి కారణం ఓ ఇల్లు అని తెలుస్తోంది. మోహన్ బాబు తన శేష జీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో ఓ విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సిబ్బంది గదులతో పాటు సకల సౌకర్యాలతో నిర్మించారు. ఫిల్మ్ నగర్‌లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ తనకు జల్‌పల్లి ఇంట్లో వాటా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అందుకే గొడవ జరిగినట్లు వినిపస్తోంది. ఇక, మరోవైపు.. కారణం అది కాదని, వేరే ఉందని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా మోహన్ బాబు జల్‌పల్లి ఇంట్లోనే ఉంటున్నారు. అక్కడ మొదటి నుంచీ ఉన్న వర్కర్లు ఉన్నారు. మనోజ్ అతని భార్య వైపు నుంచి వచ్చిన వర్కర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు బాగా సేవలు చేసే, అతి సన్నిహితమైన మేల్ వర్కర్‌కు; మనోజ్ కుటుంబానికి సేవలు చేసే లేడీ వర్కర్‌కు మధ్య ఏదో జరిగింది. ఈ విషయంలో ఆ మేల్ వర్కర్‌ను మనోజ్ గట్టిగా కొట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వర్కర్ డ్యూటీకి కొన్ని రోజులు రాలేదు. మోహన్ బాబు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. దాంతో తన వర్కర్‌ను కొడతావా? అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది. తన తల్లి మీదకు వెళ్తావా? అని తండ్రితో మనోజ్ గొడవ పెద్దదిగా చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద చిన్న విషయం చినికి చినికి గాలివానగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇరువురి మధ్య ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు.