Pawan Kalyan: మూలాలు మర్చిపోవద్దు..! అల్లు అర్జున్‌కి పవన్ స్ట్రాంగ్ కౌంటర్..?
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలని మర్చిపోకూడదని.. చిరంజీవి గారి వల్లే తామంతా ఈ స్టేజ్‌లో ఉన్నామని, చరణ్ అయినా తానైనా, మెగా హీరో ఎవరైనా ఈ స్థాయికి వచ్చామంటే దానికి మూలం చిరంజీవేనని అన్నారు. మన ఎదుగుదలకు ఎవరు మూలమో వారిని గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా పైస్థాయిలో ఉంటామని చెప్పారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాను సోలోగానే ఈ స్థాయికి ఎదిగానని హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే పవన్ తాజాగా వ్యాఖ్యానించారని, అంతేకాదు పదే పదే ‘మూలాలు’ అంటూ నొక్కి నొక్కి చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఎన్నికలప్పుడు హీరోలు మద్దతు తెలపలేదు!
అంతేకాదు, ఎన్నికల సందర్భంగా చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపలేదని, ప్రతిపక్షాలకు మద్దతు తెలిపారని పవన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కూడా అల్లు అర్జున్‌ని ఉద్దేశించి చేసినవే అన్న చర్చ జరుగుతోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తన మామయ్య అధినేతగా ఉన్న జనసేన పార్టీకి గానీ, లేదా కూటమి అభ్యర్థులకు గానీ మద్దతు తెలపకుండా వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
చర్చనీయాంశంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు?
ఈ నేపథ్యంలోనే చాలా కాలం అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరిగింది. సోషల్ మీడియాలో వేదికగా మెగా ఫ్యాన్స్ – అల్లు ఆర్మీ మధ్య మాటల యుద్ధం నడిచింది. నాగబాబు, సాయిధరమ్ తేజ్ పరోక్షంగా అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో కౌంటర్లు కూడా వేశారు. అయితే.. ఇటీవల అల్లు అర్జున్ అరెస్టైనప్పుడు చిరంజీవి, నాగబాబు అల్లు అరవింద్‌ను ఇంటికి వెళ్లి మరి ఓదార్చారు. దానికి కృతజ్ఞతగా అల్లు అర్జున్ సైతం చిరంజీవిని, నాగబాబును వారి ఇళ్లకు వెళ్లి కలిశారు. క్లిష్టసమయంలో అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.