తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa-2: బాబోయ్.. అక్కడ ‘పుష్ప-2’ టిక్కెట్ ధర ఏకంగా రూ. 3000!

యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘పుష్ప-2’. అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల అవుతున్న ఇండియాలో మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక, ఓవర్సీస్‌లోనూ అత్యధికంగా టిక్కెట్స్ అమ్ముడైన మూవీగా నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఈ మూవీ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఈ మూవీకి సంబంధించి డిసెంబర్ 4న పడనున్న బెనిఫిట్ షో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే పలు ప్లాట్ ఫామ్స్ వేదికగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ థియేటర్‌లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.3 వేలకు ‘పుష్ప2’ బినిఫిట్ షో టికెట్‌ను విక్రయిస్తున్నారు. ఇంతకీ ఆ థియేటర్‌ ఎక్కడుందో తెలుసా?

ఎందుకు అంత ధర?

ముంబైలోని జియో వరల్డ్‌డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్‌ మైసన్‌లో ఏకంగా ‘పుష్ప – 2’ మూవీ టికెట్ ధర రూ.3 వేలు చూపిస్తోంది. అక్కడకు వెళ్లే ప్రేక్షకుడికి వీఐపీ తరహాలో సౌకర్యాలు ఉండటమే ఇందుకు కారణం. పీవీఆర్‌ మైసన్‌లోని ఓ స్క్రీన్‌లో మొత్తం 34 సీట్లు ఉంటాయి. ఉదయం నుంచి ప్రదర్శించే షోలకు రూ.900 ఉండగా, రాత్రి 7.35 నిమిషాల షోకు మాత్రం టికెట్‌ ధర రూ.3వేలు ఉండటం గమనార్హం. అక్కడే ఉన్న మిగిలిన స్క్రీన్‌లలో రెక్లయినర్‌ ధర రూ.2100గా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. జియో వరల్డ్‌ డ్రైవ్‌లోని పీవీఆర్‌ సినిమాస్‌ పూర్తి లగ్జరీ వాతావరణంలో ఉంటుంది. ఈ సీట్లు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రేక్షకులకు కోరిక మేరకు ఒక్క బటన్‌ నొక్కితే కోరిన ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తారు. తమకు కావాల్సిన మేరకు సీట్లను జరుపుకొనే మెకానిజం కూడా అందులో ఉంటుంది. అంతేకాదు, 7.1డాల్బీ సరౌండ్‌ సిస్టమ్‌తో అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్‌ అక్కడ ఉంటుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button