Pushpa-2: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్..’ సీఎంను కలిసిన రెండు రోజులకే మళ్లీనా!
‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్’ అన్న డైలాగ్ పుష్ప-2 సినిమాలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ని ఎంత రెచ్చగొట్టిందో.. ఇవే డైలాగ్స్‌తో రిలీజ్ చేసిన పాట మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చాలా డిస్టర్బ్ చేసేసింది. సినిమాలో పోలీసుల్ని రెచ్చగొడుతూ, వాళ్లకు సవాల్ విసురుతూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అది. ఆ డైలాగ్‌నే ఓ నాలుగు రోజుల క్రితం మూవీ టీం యూట్యూబ్‌లో పాటగా రిలీజ్ చేసింది. ఇక, అంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్‌ల పరోక్ష మాటల యుద్ధం జరిగింది. ఇంకేముంది.. ఈ పాటను రేవంత్ రెడ్డిని, పోలీసుల్ని రెచ్చగొట్టేందుకే, వారికి కౌంటర్ ఇచ్చేందుకే రిలీజ్ చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆఘమేఘాల మీద ఆ పాటను తొలిగించింది, మూవీ టీం.
రెండు రోజులకే రిలీజ్!
అయితే, డిసెంబర్ 26న సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల పెంపుపై సీఎంను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ సీఎం ఒప్పుకోకపోవడంతో ఎలా వెళ్లారో మళ్లీ అలాగే వచ్చేశారు. ఈ భేటీ ద్వారా టైమ్ వేస్ట్ తప్ప.. సినీ పెద్దలకు ఒరిగిన ప్రయోజనమేమీ లేదన్నది నగ్నసత్యం. అయితే అప్పుడు తొలగించిన ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్..’ సాంగ్.. సినీ ప్రముఖులు సీఎంను కలిసిన రెండు రోజులకే అంటే.. ఇవాళ మళ్లీ యూట్యూబ్‌లో ప్రత్యక్షమవడం చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను క్యాన్సిల్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంత జరుగుతున్న ఈ ఇష్యూలో అల్లు అర్జున్ ఏమాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నేపథ్యంలో ఈ పాట మరోసారి యూట్యూబ్‌లో ట్రెండ్ అవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.