Pushpa-2: పుష్ప-2 అసలు టార్గెట్ వాళ్లేనా?
ఇండియా వ్యాప్తంగా పుష్ప-2 మాస్ జాతర కొనసాగుతోంది. వసూళ్ల పరంగా ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ తెలుగులో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేయడం మామూలే. ఎందుకంటే ఇది తెలుగు సినిమా. పైగా డైరెక్టర్, హీరో ఇద్దరూ మనోళ్లే. కానీ నార్త్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఏకంగా బాలీవుడ్‌లో గత రికార్డులన్నీ బద్దలుకొట్టింది. సుకుమార్ టేకింగ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ చూసి ఇండియా వైడ్‌గా మూవీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇందుకు సుకుమార్, బన్నీ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది.
నార్త్‌లో పుష్పరాజ్ హవా!
పుష్ప-2 మేకింగ్, టేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్ ఇవన్నీ పరిశీలించి చూస్తే నార్త్ బెల్ట్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికే ఎక్కవ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో డ్రెస్ సెన్స్, గుట్కా లాంటిది నోట్ల వేసుకోవడం, మందు, ఆయుధాలు, జీపు మీద కూర్చుని తిరగడం ఇలా చాలా సీన్లు బీహార్, యుపి బెల్ట్ కుర్రాళ్లను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్లు అన్నీ పోగేసి తీసినట్లు కనిపిస్తోంది. కొన్ని కొన్ని సీన్లు మనకు కాస్త ఓవర్‌గా అనిపించినా నార్త్ బెల్ట్‌లోని కొన్ని ఏరియాల ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకునే మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. మేకర్స్ ప్లాన్‌కు తగ్గట్టే దానికి తగ్గట్టే ఈ సినిమాకు నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.