తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa-2: తొక్కిసలాట ఘటనపై.. స్పందించిన పుష్ప-2 నిర్మాతలు!

సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. వారిని అదుపు చేయడం థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కొడుకు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటన పట్ల పుష్ప-2 టీంపైన, థియేటర్ యాజమాన్యంపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. పుష్ప-2 క్రేజ్‌ను బట్టి అక్కడ అంత క్రౌడ్‌ ఉంటుందని తెలిసినా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు ఎందుకు వచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం!

ఇక, ఈ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ టీం సదరు మహిళ కుటుంబాన్ని పరామర్శించగా, తాజాగా పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘నిన్న రాత్రి జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకి, చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి కోసం మేం ప్రార్థిస్తున్నాం. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మేం అన్ని విధాలుగా అండగా నిలబడతాం’ అంటూ పోస్ట్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసముండే భాస్కర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీళ్ల అబ్బాయి శ్రీతేజకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. పుష్ప సినిమాకు పెద్ద అభిమాని. దీంతో పుష్ప-2 సినిమాను మొదటి రోజు చూపించేందుకు భాస్కర్ తన కుంటుంబాన్ని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గరకు తీసుకొచ్చానని, కానీ ఇలా జరిగిందని మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button