Pushpa-2: వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో సంచలన రికార్డ్ సృష్టించిన పుష్ప-2!
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలై 15 రోజులు దాటినా కలెక్షన్ల సునామీలో ఏమాత్రం తగ్గేదే లే అంటోంది. ఇప్పటికే గత రికార్డులన్నీ తెరమరుగు చేసిని ఈ సినిమా తాజాగా మరో సంచలన రికార్డ్ నమోదు చేసింది. రూ.632 కోట్లు కలెక్ట్ చేసి హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఘనత సాధించిండం గత 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.
రన్ టైం పెంచుతారా?
విడుదలైన 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో నయా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప-2’.. ‘బాహుబలి-2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు చిత్ర బృందం మరికొన్ని సన్నివేశాలు జత చేయనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయా సీన్ల రన్‌టైమ్ దాదాపు 18 నిమిషాలు ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 20 నిమిషాలు ఉంది. అది యాడ్ చేస్తే 3 గంటల 38 నిమిషాలు అవుతుంది. దీని వల్ల రిపీట్ ఆడియన్స్ వస్తారని, కలెక్షన్స్ మరింత పెరుగుతాయని మేకర్స్ ఆలోచిస్తున్నారు.