Pushpa-2: ‘పుష్ప-2’ టికెట్ ధరలు భారీగా పెంపు.. బెనిఫిట్ షోలకూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి!
‘పుష్ప-2’ మూవీ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ టిక్కెట్స్ రేట్స్ పెంపునకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే రూ.800గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
3 గంటల 20 నిమిషాల రన్ టైం
కాగా.. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ‘పుష్ప-2’ రన్ టైమ్ విషయానికొస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో రాబోతోంది. ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ‘పుష్ప2’కు యూ/ఏ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విడుదలకు ముందే బుక్సింగ్స్, సాంగ్స్ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్న ‘పుష్ప2’ రన్‌టైమ్ పరంగానూ రికార్డు నెలకొల్పింది.