Pushpa-2: ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ‘పుష్ప-2’ని ఏ భాషలో అయినా చూడొచ్చు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మూవీ విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ టీమ్ అంతా ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ మేనియానే కనిపిస్తోంది. ఈ మూవీకి వస్తున్న క్రేజ్‌ను బట్టి మేకర్స్ సరికొత్త ఆలోచన చేశారు. ‘పుష్ప-2’ను ఏ భాషలో అయినా చూసే సౌకర్యాన్ని ప్రేక్షకులకు కల్పించారు.
నచ్చిన భాషలో..
‘పుష్ప-2’ సినిమా ఇండియా వైడ్‌గా తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఏ భాషలో ఆడే థియేటర్‌కి వెళ్లినా అక్కడ మనకు కావాల్సిన భాషలో సినిమా చూడొచ్చు. దీని కోసం మూవీ టీం సినీ డబ్స్ యాప్‌తో లింకప్ చేసుకుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. ముందుగా సినీ డబ్స్ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మనం మూవీ చూసేముందు ఆ యాప్‌లో మనం ఏ థియేటర్లో, ఎన్ని గంటల షో చూస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం సినిమాని ఏ భాషలో చూడాలనుకుంటున్నామో ఆ భాషను సెలెక్ట్ చేసుకొని ఆ సౌండ్ ట్రాక్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం సినిమా మొదలయ్యే సమయానికి హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్క్రీన్ మీద మూవీ ప్లే అవగానే మన ఫోన్‌లోని యాప్‌లో కూడా ఆ సినిమా ప్లే బటన్ నొక్కాలి. దాంతో థియేటర్ స్క్రీన్‌పై సినిమా చూస్తూ ఆడియోని మనకు నచ్చిన భాషలో హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ రవిశంకర్ అఫీషియల్‌గా ప్రకటించారు.