
RGV: చెక్ బౌన్స్ కేసు.. రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష!
వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు షాకిచ్చింది. ఈ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. అంతేగాక మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.
చెక్ బౌన్స్ కేసు
వివరాల్లోకి వెళితే.. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడూ కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి మూడు నెలల జైలు శిక్ష విధించింది. కాగా.. 2022లో ఇదే కేసులో వర్మ బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వర్మ ఈ కేసుని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది.